బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో సినీ పరిశ్రమలో బంధుప్రీతి అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ వంటి వారు సైతం బాలీవుడ్ కొంత మంది చేతుల్లోనే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పంజాబీ బ్యూటీ తాప్సీ నెపోటిజంపై మాట్లాడింది. తాను కూడా నెపోటిజం బాధితురాలినేని తాప్సీ తెలిపింది. ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారికే పరిచయాలు అధికంగా ఉంటాయని ఆమె తెలిపింది. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప్రవేశించిన వారికి సినీ ప్రముఖులు పరిచయాలు అవడానికి చాలా సమయం పడుతుందని తెలిపింది.
ఈ కారణంగానే దర్శకులు కూడా ప్రముఖుల వారసులతోనే సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతారని చెప్పింది. అందుకే మొదట్లో నాకు ఆఫర్లు రావడానికి చాలా సమయం పట్టిందని తెలిపింది. బయటి వాళ్లతో పోలిస్తే సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి అవకాశాలు త్వరగా వస్తాయి. నెపోటిజం వలన నేను కొన్ని సినిమాలు కోల్పోవల్సి వచ్చింది. అలాంటి సందర్భాల్లో చాలా బాధగా ఉంటుంది అని తాప్సీ వివరించింది. ఆ సమయంలో తాను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనని ఆవేదన చెందింది. ప్రేక్షకులు కూడా ప్రముఖుల వారసులు నటించిన సినిమాలను చూడడానికే ఇష్టపడతారని చెప్పింది.