మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ముంబైలో.. తను మాత్రం హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకుంటూ కరోనా మహమ్మారితో పోరాడి గెలిచింది. ఆ తరువాత డిశ్చార్జ్ అయిన తమన్నా రిలాక్స్ కోసం ముంబై వెళ్లిపోయింది. అక్కడ తన వాళ్లతో కలిసి పూర్తిగా కోలుకుంది. కరోనా సోకిన తరువాత తాను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొందో తాజాగా వెల్లడించింది. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన సమయంలో చాలా భయపడ్డానని, చికిత్స పొందుతున్న సమయంలో చనిపోతానేమోననే ఆలోచనలు ఎక్కువగా వచ్చాయని తమన్నా చెబుతోంది.
కరోనాకు సంబంధించిన తీవ్రమైన లక్షణాలు నాలో కనిపించాయి. కానీ వైద్యులే నన్ను బ్రతికించారు. క్లిష్టపరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి వుంటాను. జీవితం ఎంత విలువైందో తెలిసింది. కోవిడ్ నుంచి కోలుకునే క్రమంలో డాక్టర్లు చెప్పిన మందులు వాడాను. దాని వల్ల కొంత బరువు పెరిగాను. ఇటివల సోషల్ మీడియాలో ఓ ఫొటోని షేర్ చేశాను. అది చూసిన వాళ్లు లావుగా వున్నావని కామెంట్ చేశారు. ఒకరి గురించి కామెంట్ చేసే ముందు ఆ వ్యక్తికి ఏమైందో కూడా తెలుసుకోకుండా వారిలో వున్న లోపాలను మాత్రమే వెతుకుతుంటారనే విషయం అప్పుడు నాకు అర్థమైంది` అని తెలిపింది తమన్నా.