అలనాటి హీరోయిన్ జమున (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్టు 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తండ్రి పేరు నిప్పణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు జానాభాయి. జ్యోతిషుల సూచనతో ఆమె తల్లిదండ్రులు జమునగా పేరు మార్చారు. జమునకు బాల్యం నుంచే నటన పై ఆసక్తి వుండేది.
‘ఖిల్జీరాజుపతనం’ నాటకంలోని ఓ పాత్రకు సీనియర్ నటుడు జగ్గయ్య ఆమెను ఎంపిక చేశారు. ‘మా భూమి’ నాటకం చూసి డాక్టర్ గరికిపాటి రాజారావు ఆమెకు మొదటి సినీ అవకాశాన్నిచ్చారు. అలా జమున మొదటిసారి 1952లో విడుదలైన ‘పుట్టిల్లు’ సినిమా కోసం పనిచేశారు. గడుసైన పాత్రలు, ముఖ్యంగా సత్యభామ పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఆమె నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో కొన్ని వందల చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, కృష్ణ సహా పలువురు దిగ్గజ నటులతో ఆమె నటించి ప్రేక్షకులని అలరించారు..!!