ముప్పవరపు వెంకయ్య నాయుడు, మాజీ భారత ఉప రాష్ట్రపతి గారిని లీడర్ ని చేసింది ఎవరు? నటశేఖర్ కృష్ణ నటించిన “అవేకళ్ళు” సినిమా థియేటర్ వద్ద జరిగిన చిన్న ఘర్షణ వెంకయ్య నాయుడు గారిని లైం లైట్ లోకి తెచ్చి, ఆయనను పాలిటిక్స్ వైపుకు ప్రేరేపించింది, వినటానికి కొంత ఆశ్ఛర్యంగా ఉన్నా! ఇది నిజం. హీరో కృష్ణ గారు నటించిన అవేకళ్ళు సినిమా 1967 లో నెల్లూరు నగరం లోని కనక మహల్ లో రిలీజ్ అయింది, ఆ సినిమా క్యూ లైన్ లో ఉన్నా బంగారు రెడ్డి అనే స్టూడెంట్ కుర్ర వాడు,తోపులాటలో క్యూ లైన్ నుంచి బయటకు నెట్టివేయబడ్డాడు , తిరిగి క్యూ లైన్ లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూసిన, థియేటర్ యజమాని అయినటువంటి నెల్లూరు కాంత రావు,( ఈయన సినిమా నటుడు, నిర్మాత, థియేటర్ యజమాని, ఆ పైగా అప్పటి “పహిల్వాన్” కూడా) ఈ కుర్రవాడు క్యూ లోకి దూరుతున్నాడు అని భ్రమ పడి, అయన వెళ్లి ఈ కుర్రవాడిని బయటకు లాగి, రెండు తగిలించాడు ,ఇంకేముంది, స్టూడెంట్ ని కనక మహల్ ఓనర్ కొట్టాడు అనే వార్త నెల్లూరు లో దావానలం లాగ వ్యాపించింది, అప్పటి నెల్లూరు వి.ఆర్. కాలేజీ స్టూడెంట్ అయిన వెంకయ్య గారు కొంత మంది స్టూడెంట్స్ తో కలసి థియేటర్ దగ్గరకు వెళ్లి గొడవకు దిగారట..
కానీ థియేటర్ వారి దెబ్బకు తట్టుకోలేక వెనకకు వచ్చిన వెంకయ్యలో కసి పెరిగింది, అంతే,జిల్లాలో ఉన్నా అన్ని కాలేజీలకు ఈ వార్తను చేరవేసి, జిల్లా బంద్ నిర్వహించి, వందల మంది స్టూడెంట్స్ ని పోగేసి , థియేటర్ మీద రాళ్లు వేసి నిరసన తెలియచేశారట.ఈ సంఘటన ఎంత ప్రాధాన్యం సంతరించుకున్నది అంటే , అప్పటి అసెంబ్లీ లో చర్చ జరిగేంతగా, పెద్ద ఇష్యూ అయింది.థియేటర్ యజమాని,సామాజికంగా, రాజకీయం గ పలుకుబడి కలిగిన వారు అవటం తో పోలీస్ కేసు అవటం, వెంకయ్య గారు జీవితం లో మొదటి సారి పోలీస్ స్టేషన్ మెట్లు యెక్క వలసి వచ్చింది. దెబ్బకు జిల్లా వ్యాప్తంగా వెంకయ్య నాయుడు పేరు మారు మ్రోగింది. ఈ సంఘటన తో తాను కూడా రాజకీయ పార్టీలో చేరాలి, రాజకీయ అండ దండాలు లేవు కాబట్టి, తనను అరెస్ట్ చేయించారు అని మన యంగ్ వెంకయ్య దృఢంగా నిర్ణయించుకున్నారు . ఏ మాత్రం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య నాయుడు..
రాజకీయ పార్టీ లో చేరటం, తన సంకల్పం, నిబద్ధత, వాక్ చాతుర్యం తో నిరంతరం ఒక సైనికుడి లాగా పని చేసిన వెంకయ్య గారు, ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి, పార్టీ జాతీయ నాయకుడిగా, భారత ఉప రాష్ట్రపతిగా ఎదిగారు. రోజుకు ఒక పార్టీ మారి, అప్పటి వరకు తిట్టిన పార్టీలోనే చేరి ,ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చాయి కాబట్టి ఈ పార్టీ లో చేరాను అని చెప్పుకొనే ఈ రోజుల్లో, ఒకే పార్టీలో ఉంటూ, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ లో ఎదిగి, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మన వెంకయ్య అని ఆప్యాయంగా పిలిచే విధంగా అయన ఎదిగిన తీరు, నిజంగా ఎంతో ప్రశంసనీయం, ఆచరణీయం. ఎక్కడ 1967 లో రిలీజ్ అయిన “అవేకళ్ళు”, ఎక్కడ 2023 వ సంవత్సరం, ఇప్పటికీ, “అవే అడుగులు”, “అవే పలుకులు”, అదే నెల్లూరు యాస, అదే తెలుగోడి పంచ కట్టు, తడబాటు లేని నడక, అదే నిబద్ధత , పదవులకు అయన అలంకారం అయ్యారు కానీ పదవులు ఆయనకు అలంకారం కాలేదు, ఆయన అందరివాడు..!!