శోభన్ బాబు గారిని తప్పుగా అర్ధం చేసుకొని, ఆయన ఇచ్చిన బంగారం లాంటి సలహాను లైట్ గ తీసుకొన్న రంగనాథ్ గారు. శోభన్ బాబు గారు మృదు స్వభావి, మిత భాషి, అనవసరంగా ఎవరి విషయంలోనూ కలుగచేసుకొనే వారు కాదు అది ఇండస్ట్రీ లో అందరికి తెలిసిన విషయమే. వాహిని స్టూడియోలో “రామబాణం” చిత్రం షూట్ లో ఉన్న శోభన్ బాబు గారి వద్దకు వచ్చిన రంగనాథ్ తాను కొన్న కొత్త అంబాసడర్ కారు గురించి చెప్పారు, వెరీ గుడ్, కంగ్రాట్స్ అంటూ కూర్చోమన్నారు రంగనాథ్ ను, ప్రక్కన కూర్చున్న రంగనాథ్ తో కెరీర్ ఎలా ఉంది అని అడిగారట, బాగానే ఉంది సర్, హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నాను, మరో అయిదు సినిమాలు లైన్ లో ఉన్నాయి అని ఉత్సాహంగా చెప్పారట రంగనాథ్. ఒకే , నాలుగు ప్లస్ అయిదు, ఆ తరువాత? అన్నారట శోభన్ బాబు, అర్ధం కానీ రంగనాథ్ బ్లాంక్ గ చూస్తుంటే, చూడు రంగనాథ్ నీకు ఉన్న ఫిజిక్, వాయిస్, టాలెంట్ కి నువ్వు క్యారెక్టర్ రోల్స్ చేస్తే, ఎస్.వి.ఆర్. అంత గొప్ప పేరు సంపాదిస్తావు, అంతే కాదు జీవితాంతం నటిస్తుంటావు, అదే హీరోగా అయితే నీకు అంత సుదీర్ఘమయిన కెరీర్ ఉండదు, అని చెప్పారట, అది విన్న రంగనాథ్ గారు ఏమి మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నారట. ఇదేమిటి హీరోగా చేస్తున్న వాడిని డిస్కరేజ్ చేస్తున్నారు క్యారెక్టర్ రోల్స్ చేయమంటున్నారు, అంతేలే ఎంత పెద్ద వారికీ అయినా లోపల కొంత అసూయ ఉంటుంది అనుకున్న రంగనాథ్ గారు ఇదే మాట ఒకరిద్దరి సన్నిహితుల దగ్గర చెప్పి బాధ పడ్డారట.
రోజులు గడిచాయి వెరైటీ కోసం “గువ్వల జంట” అనే సినిమాలో విలన్ రోల్ చేసిన రంగనాథ్ గారికి ఆ తరువాత వరసగా విలన్ ఆఫర్లే రాసాగాయి, కొంత కాలానికి అవి కూడా తగ్గిపోయాయి, ఆర్ధిక సమస్యలు మొదలు అయ్యాయి మద్రాసులో ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు, సినిమా అవకాశాలు లేక “శాంతినివాసం” అనే సీరియల్ లో వయసు మళ్ళిన పాత్రలో నటించారు ఆ సీరియల్ డైరెక్టర్ రాజమౌళి గారు, ఆయనతో ఏదో అభిప్రాయ బేధాలతో ఆ సీరియల్ కూడా వదిలేసారు. ఒక్క సారి వెనుకకు తిరిగి చూసుకున్న రంగనాథ్ గారికి అప్పుడెప్పుడో శోభన్ గారు ఇచ్చిన సలహా గుర్తుకు వచ్చింది, అవును నిజమే ఆయన ఇచ్చిన సలహా పాటించి ఉంటె తనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అన్న విషయం ఆయన కు అప్పుడు అర్ధం అయ్యింది, శోభన్ బాబు గారు అప్పటికే మరణించారు, శోభన్ బాబు గారిని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు రంగనాథ్ గారు ఎంతో బాధ పడ్డారు. ఏది ఏమయినా గతించిన కాలాన్ని వెనుకకు తీసుకొని రాలేము, కాలం తో పాటు రంగనాథ్ గారు కూడా అత్యంత విషాదకరంగా నిష్క్రమించారు. ఈ సంఘటన భావి తరాలకు ఒక గుణపాఠం గ నిలిచి పోతుంది అనటానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. స్కూల్ లో పాఠాలు చెప్పి పరీక్షలు పెడతారు, కానీ జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది..!!