చెళ్ళపిళ్ళ సత్యనారాయణ శాస్ట్రీ అంటే ఎవరికి తెలియక పోవచ్చు, కానీ సంగీత దర్శకుడు సత్యం గారు అంటే తెలియని వారుంటారా? ఆయన 20 ఏళ్ళ సినీ ప్రస్థానం లో దాదాపుగా 550 చిత్రాలకు సంగీతం అందించారు అంటే మీకు ఆశ్చర్యం గ ఉంటుంది. అటువంటి దిగ్గజ సంగీత దర్శకుడిని, నిర్మాత మల్లెమాల సుందర రామి రెడ్డి గారు ఒక సందర్భం లో రెండు చెంపలు వాచిపోయేట్టు కొట్టారు. ఈ నిర్మాత ఎవరో కాదు మన మల్లెమాల ప్రొడక్షన్స్ శ్యాం ప్రసాద్ రెడ్డి గారి నాన్న గారు. సంగీత దర్శకుడిగా సత్యం గారు ఎంతో ప్రజ్ఞావంతుడు, కానీ ముక్కోపి. మల్లెమాల ప్రొడక్షన్స్ వారి ” తలంబ్రాలు ” చిత్రం పాటల రికార్డింగ్ సందర్భంలో సుశీల గారు ఒక అరగంట ఆలస్యంగా రావటం జరిగింది, ఆమె కోసం ఎదురు చూస్తున్న సత్యం గారికి ఆమెను చూడగానే కోపం కట్టలు తెంచుకుంది. బండబూతులు తిట్టడం మొదలెట్టారట, ఆ సంస్కృతం విని తట్టుకోలేని సుశీల గారు ఏడుస్తూ బయటకు వెళ్లిపోయారట,
బయట ఉన్న ఎం.ఎస్. రెడ్డి గారికి విషయం చెప్పి భోరున విలపించారట. రెడ్డి గారు చాల ముక్కుసూటి మనిషి, వెంటనే సుశీల గారిని తీసుకొని రికార్డింగ్ థియేటర్ లోకి వెళ్లిన రెడ్డి గారు సత్యం గారిని పిలిచి చెంప ఛెళ్ళు మనిపించారట, ఏమైందండీ అని సత్యం గారు అడిగే లోపు రెండో చెంప కూడా ఛెళ్ళు మనిపించి, ఎంత సంగీత దర్శకుడివి అయితే మాత్రం ఒక ఆడ కూతురిని అంతంత మాటలు అంటావా అంటూ కోపం తో ఊగిపోయారట. సత్యం గారు సుశీల గారికి క్షమాపణ చెప్పి, రికార్డింగ్ మొదలు పెట్టారట. అప్పుడు సుశీల గారు పాడిన విషాద భరితమయిన పాట అద్భుతంగా వచ్చింది. ” ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, వేదన శృతిగ, రోదన లయగా సాగే గానమిది ” అనే విషాద గీతం తలంబ్రాలు చిత్రంలో మీరు వినే ఉంటారు. వినక పోతే ఇప్పుడు వినండి సుశీల గారు ఎంత అద్భుతంగా పాడారో తెలుస్తుంది.