నెట్టింట వైరల్‌గా మారిన రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నెట్టింట తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా వేదికలదేనని స్పష్టం చేశారు. నెట్టింట భారతీయుల భద్రత, నమ్మకం పెంపొందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి చంద్రశేఖర్ ఐటీ చట్టంలోని పలు నిబంధనలను నెటిజన్లతో పంచుకున్నారు.
యూజర్లు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేయకుండా చూడాల్సిన చట్టపరమైన బాధ్యత ఆయా వేదికలపై ఉందన్నారు. ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు తప్పుడు సమాచారాన్ని సంస్థలు తొలగించాలన్నారు. నిబంధనలు పాటించని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై రూల్ 7 వర్తిస్తుందని, సంస్థలపై కోర్టును ఆశ్రయించే హక్కు బాధితులకు ఉందని తెలిపారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో చాలా ప్రమాదకరమైనదని, తప్పుడు సమాచార వ్యాప్తికి ఆస్కారం ఉందని, ఈ విషయంలో సోషల్ మీడియా వేదికలు గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు..!!