అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకురానుంది. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, రవిశంకర్ నిర్మించారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో రష్మిక మందన్న పాత్రికేయులతో సంభాషిస్తూ చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే.. “జీవితాన్ని ఆనందంగా గడపాలనే మనస్తత్వమున్న అమ్మాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తా. అంతర్లీనంగా ఓ తుంటరితనం ఉంటుంది.
పుష్పరాజ్ జీవితానికి దృశ్యరూపంగా సినిమా ఉంటుంది…అతడి కుటుంబం, పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.అతడి లైఫ్‌లోకి శ్రీవల్లి ఎలా ప్రవేశించింది? ఆమె ప్రేమ కోసం పుష్పరాజ్ ఏం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. మొండివాడైన కథానాయకుడిని ఆటపట్టించే అల్లరి అమ్మాయిగా విభిన్నంగా నేను కనిపిస్తా. నవ్విస్తూనే భావోద్వేగానికి లోను చేసే క్యారెక్టర్ చేశా..షూటింగ్ మొదలైన తొలినాళ్లలో అతడితో సమానంగా నటించగలనా? నా పాత్రకు న్యాయం చేస్తానా? లేదా? అని భయపడ్డా.
నాలో ఉన్న భయాలను బన్నీకి వివరించా. ‘కష్టపడేతత్వం, ప్రతిభ వల్లే ఈ స్థాయికి చేరుకున్నావు. వాటిని నమ్ముకొనే ముందుకు సాగు’ అని ఆయన సలహా ఇచ్చారు. బన్నీ మాటలతో నాలో ధైర్యం వచ్చింది. అగ్రహీరోయిన్‌గా చెలామణి అవుతూ ప్రత్యేక గీతంలో నటించడానికి అంగీకరించడం సమంత గొప్పతనానికి నిదర్శనం. ఆ పాట నాకు చాలా నచ్చింది. బాగుందని సమంతకు మెసేజ్ చేశాను. ప్రత్యేకగీతాల్లో అవకాశం వస్తే ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే ఐటెంసాంగ్స్ చేసే ఉద్దేశ్యం లేదు.