కామెడీ కింగ్ రాజబాబు, వెండి తెర మీద నవ్వులు పూయించిన హాస్య నట చక్రవర్తి. నటుడిగా హాస్యాన్ని పండించిన రాజబాబు నిజ జీవితం లో చాల తాత్విక చింతన కలిగి ఉండేవారు. ఆ రోజుల్లో హీరోల తో సమానం గ మూడు షిఫ్ట్ లు పని చేస్తూ ,వారితో సమానం గ రెమ్యూనరేషన్ తీసుకొనే రాజబాబు, చేతికి ఎముక లేదు అనే విధంగా ఎన్నో దాన, ధర్మాలు చేసేవారు. రాజబాబు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తల్లో జరిగిన ఒక సంఘటన ఆయన మనసులో చెరగని ముద్ర వేసింది. అప్పటికి ఒక పది సినిమాలు నటించి ఉంటారు రాజబాబు, అప్పుడప్పుడే నటుడిగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో ఆయన వాహిని స్టూడియో లో ఒక షాట్ లో నటించి బయటకు రాగానే అక్కడే ఉన్న ఒక లైట్ బాయ్ సార్ చాల బాగా చేసారు, మీరు చాల పైకి వస్తారు, మీరు బాగా ఎదిగితే నాకు బట్టలు పెట్టాలి అన్నాడట.
ఆ తరువాతి కాలం లో రాజబాబు తిరుగులేని నటుడిగా ఎదగటం జరిగింది, ఆయనకు మాత్రం ఆ లైట్ బాయ్ అన్న మాటలు ఎప్పుడు మదిలో మెదులుతూ ఉండేవి. ఆ లైట్ బాయ్ నోటి చలవ వల్లనే తాను ఇంత ఎదిగానేమో అని అనుకొనేవారట. తిరిగి అతనికి ఏదయినా సహాయం చేద్దామని అనుకున్న రాజబాబు, దురదృష్ట వశాత్తు ఆ లైట్ బాయ్ ఎవరు అనేది గుర్తించలేక పోయారు. దానికి పరిహారంగా రాజబాబు గారు తన ప్రతి పుట్టిన రోజున, మద్రాస్ లో ఉన్న అన్ని స్టూడియోలలోని లైట్ బాయ్స్ కి బట్టలు పెట్టి, ఒక బిరియాని ప్యాకెట్ ఇచ్చేవారట. ఇంతే కాదు తన పుట్టిన రోజున పాత తరం నటి నటులను సత్కరించి, ఆర్ధిక సహాయం చేసేవారు రాజబాబు. మనం ఎంత సంపాదించాము అనేది ముఖ్యం కాదు, అందులో ఎంత సద్వినియోగం చేసాము అనేది ముఖ్యం అనేది రాజబాబు నమ్మిన జీవిత సత్యం, దాన్నే ఆయన పాటించి, కీర్తి శేషుడయ్యాడు..!!