సినీరంగంలోని కృత్రిమ అనుబంధాలు, అవకాశవాద స్నేహాలు తనకు నచ్చవని చెబుతున్నది కథానాయిక రాధికా ఆప్టే. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాల నాయికగా పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం లండన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నది. పరిశ్రమ తాలూకు హంగూ ఆర్భాటాలకు దూరంగా సేదతీరడాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘కేవలం వృత్తిపరంగానే నేను సినీరంగంతో కలిసి ప్రయాణం చేస్తాను. వ్యక్తిగతంగా ఆ వాతావరణంలో ఏమాత్రం ఇమడలేను..
కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడం, తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివి నా వ్యక్తిత్వానికి సరిపడవు. అందుకే షూటింగ్ ముగించుకున్న వెంటనే ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటా. సినీ ప్రపంచాన్ని మర్చిపోయి నాకు నచ్చిన పనులు చేసుకుంటూ విరామ సమయాల్ని ఆస్వాదిస్తా’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె హిందీలో ఫొరెన్సిక్, విక్రమ్‌వేదా చిత్రాల్లో నటిస్తున్నది.