మొన్నటివరకు ఇది పుకారు మాత్రమే. కానీ ఇప్పుడా పుకారే నిజమైంది. ఊహాగానమే వాస్తవరూపం దాల్చింది. అవును.. సలార్ సినిమా 2 భాగాలుగా రాబోతోంది. ప్రభాస్ కెరీర్ లో ఓ సినిమా ఇలా రెండు పార్టులుగా రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా పార్ట్-1, పార్ట్-2గా థియేటర్లలోకి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రభాస్ నుంచి సలార్ సినిమా 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సలార్ సినిమా. స్క్రిప్ట్ లాక్ చేసి సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా నిడివి మరింత పెరుగుతోంది. దీంతో సలార్ ను 2 పార్టులుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
మొదటి భాగం 2023లో రిలీజ్ అవుతుంది. రెండో భాగం కూడా దాదాపు అదే ఏడాదిలో థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. మార్చి లో రాధేశ్యామ్ థియేటర్లలోకి రాబోతోంది. ఇక అక్టోబర్ లో ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత 2023 సంక్రాంతికి లేదా సమ్మర్ కు సలార్ పార్ట్-1 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.