మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో వస్తున్న పలు రూమర్లపై నిర్మాత నాగవంశీ మరోమారు స్పందించారు. ముందుగా అనుకున్న కథతో సినిమాను రూపొందడం లేదని, దర్శకుడిని మార్చేశారని, సంగీత దర్శకుడిని మార్చేశారని, ముందుగా పూజాహెగ్డేను తీసుకుని ఆ తర్వాత మరో హీరోయిన్‌ను తీసుకున్నారని, సినిమాను రీషూట్ కూడా చేశారని, సినిమా వాయిదా పడుతుందని.. ఇలా పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఈ రూమర్లపై స్పందించారు.
నిజానికి గుంటూరు కారం సినిమాను ఆగస్టులోనే విడుదల చేయాలనుకున్నామని, అయితే ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 12కు మార్చామని తెలిపారు. అందుకనే నెమ్మదిగా చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. పూజాహెగ్డే రీప్లేస్ వార్తలపై మాట్లాడుతూ.. ఆమె మరో హిందీ చిత్రంలో నటించాల్సి వచ్చిందని, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశాం తప్పితే మరో కారణం లేదని వివరించారు. మహేశ్‌బాబు ఈ సినిమాలో భిన్నంగా కనిపిస్తారని, సంక్రాంతి పండుగకు వచ్చే సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు..!!