సినిమా రంగం పూల బాట కాదు, ఈ మార్గమ్ లో ముళ్ళు ఉంటాయి రాళ్లుంటాయి, భిన్నంగా బ్రతకాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మార్గాన్ని ఎన్నుకుంటారు, వారిలో ఆత్మా స్తైర్యం కల వాళ్ళు మాత్రమే విజయం సాధించి నిలదొక్కుకుంటారు. అటువంటి వారి సంకల్పం ఎంత బలంగా ఉంటుందో, దానికి ఒక ఉదాహరణ చంద్రబోస్ గారి సినీ ప్రయాణం. 1980 లో ఇళయరాజా చేసిన ప్రైవేట్ సంగీత ఆల్బమ్ “నథింగ్ బట్ విండ్ ” ని 4 రూపాయలకు కాపీ చేయించుకొని విని, అందులో” సాంగ్ అఫ్ సోల్” అనే బీట్ కు పాట రాసిన బాల మేధావి. ఇళయరాజా ఫోటో జేబులో పెట్టుకొని తీరిగేంత పిచ్చి,పాట అంటే. హైదరాబాద్ జె యాన్,టి.యు. లో ఇంజనీరింగ్ చేస్తూ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టి ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు, అయినా 100 ప్రయత్నాలు చేయాలి అని నిర్ణయించుకున్న చంద్రబోస్ కు 21 వ ప్రయత్నం లో డైరెక్టర్ ముప్పలనేని శివ గారు “తాజమహల్” చిత్రం లో అవకాశం ఇచ్చారు, “మంచుకొండలోన చంద్రమా ” పాటతో సినీ గేయ రచయిత గ మారారు. మొదటి సినిమా కు రామ నాయుడు గారు ఇచ్చిన 2500 రూపాయల పారితోషకం, రెండవ చిత్రాన్ని కి వచ్చిన డబ్బు తో ఒక బైక్ కొన్నారు. ముప్పలనేని శివ గారు ఇచ్చిన మరో పాటను రెడీ చేసుకొని బైక్ మీద వెళుతూ బొక్క బోర్లా పడి గాయాల పాలయ్యారు, గాయాలు కనపడకుండా ఫుల్ హాండ్స్ షర్ట్ తో దాచుకొని, రక్తం ఓడుతూనే వెళ్లి డైరెక్టర్ కు పాట వినిపించారు. చూసారుగా జీవితం ఎవడిని వదలదు, వాడి దుమ్ము రేపి దమ్మును బయటకు తెస్తుంది . దానికి చక్కని ఉదాహరణ చంద్రబోస్ గారి జీవితం.ఎక్కడో వరంగల్ జిల్లా, చల్లగరిగ అనే చిన్న ఊరిలో పుట్టి, ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని గేయ రచయిత గ ఎదగటం, రెండున్నర గంటల్లో కాలేదు, రెండున్నర దశాబ్దాలు పట్టింది.