సినిమా పరిశ్రమ లో విజయం మాత్రమే మాట్లాడుతుంది, ఎవరెంత ఘనులు అయినా ఒక్క అపజయం చాలు వారిని కరివేపాకు లాగా తీసి పారేస్తారు. మళ్ళీ నువ్వు నిరూపించుకుంటే నిలడబడతావ్ లేకుంటే అడ్రస్ లేకుండా పోతావ్, దీనికి ఎవరు అతీతులు కారు, ఎవరు ఎవరి మీద జాలి, ప్రేమ చూపించారు ఇక్కడ.దర్శకరత్న దాసరి కి కూడా ఇటువంటి అనుభవమే ఎదురయింది, 1975 వ సంవత్సరంలో వరుసగా 12 హిట్స్ ఇచ్చారు దాసరి అందరు ఆహా, ఓహో అన్నారు ఒకే ఒక్క చిత్రం “ముద్దబంతి పువ్వు” అట్టర్ ప్లాప్ అయింది, అంతే అప్పటి వరకు అడ్వాన్సులు ఇచ్చి ఉన్న 13 మంది నిర్మాతలు తమ డబ్బును వెనకకు అడిగారు, వారి డబ్బులు తిరిగి ఇవ్వడానికి తన భార్య నగలు తాకట్టుపెట్టవల్సి వచ్చింది దాసరి గారికి.
అప్పుడు వచ్చారు నిర్మాత వడ్డే రమేష్ గారు, తనకు ఒక సినిమా చేయమని, ఆశ్ఛర్యపోయిన దాసరి గారు, కసితో వ్రాసి డైరెక్ట్ చేసిన చిత్రమే కృష్ణం రాజు గారు నటించిన ” కటకటాల రుద్రయ్య”. కృష్ణం రాజు గారి కెరీర్ని మలుపు తిప్పిన చిత్రం అది. ఈ విజయ దుందుభి నాదానికి అప్పటి వరకు అడ్వాన్సులు వెనక్కు తీసుకున్న నిర్మాతలు నోళ్లు వెళ్ళబెట్టారు,ఆ తరువాత వడ్డే రమేష్ గారు నిర్మించిన అన్ని చిత్రాలకు దాసరి గారే డైరెక్టర్. వజ్రాన్ని వెలగట్టగలిగే షరాబులు కొంత మందే ఉంటారు.