సినీ నటులకు అభిమాన సంఘాలు, లేదా కొన్ని సంస్థలు బిరుదులు ఇచ్చి సత్కరించటం ఆనవాయితీ, కానీ అందుకు భిన్నంగా ఒక స్వామిజి యెన్.టి.ఆర్. కి “విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ” అనే బిరుదు ని ఇచ్చారు. 1966 లో యెన్.టి.ఆర్. నటించిన “నర్తనశాల” చిత్రం విడుదల అయి వీర విహారం చేస్తుంది, ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా యెన్.టి.ఆర్ గుంతకల్లు కు వెళ్ళటం జరిగింది. ఆయన వెంట అట్లూరి పుండరీకాక్షయ్య కూడా ఉన్నారు, పని ముగించుకున్న తరువాత ఎలాగూ ఇంత దూరం వచ్చాము, సమీపం లోనే శ్రీశైలం జగద్గురువు శంకరాచార్య ఆశ్రమం ఉన్నది, వారి దర్శనం చేసుకొని వెల్దాము అని సూచించారు. ఆశ్రమంలో ప్రవేశించిన యెన్.టి.ఆర్. గంభీరంగా నడిచి రావటం చుసిన స్వామిజి, రండి” విశ్వవిఖ్యాత నట సార్వభౌమ” ఆసీనులు కండి అంటూ సంబోధించటం జరిగింది, ఆ పలకరింపు వినిన అక్కడి వారందరు ఒకింత ఆశ్చర్య పోయారు, యెన్.టి.ఆర్. మాత్రం పులకించి పోయారు. స్వామిజి చెంత వినమ్రుడయి కూర్చున్న యెన్.టి.ఆర్. తో జగద్గురువు ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.
ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అందరు ఆ విషయాన్నీ మరచి పోయారు, కానీ పుండరీకాక్షయ్య మాత్రం ఆ పలకరింపును మరచి పోలేదు. పుండరీకాక్షయ్య నిర్మించిన “ఆరాధన” చిత్రం టైటిల్స్ లో “విశ్వ విఖ్యాత నట సార్వభౌమ” అనే బిరుదు ను వేస్తానని యెన్.టి.ఆర్. తో చెప్పారట, కానీ యెన్.టి.ఆర్. అందుకు ఒప్పుకోలేదు, అది ప్రజల సమక్షం లో వచ్చిన బిరుదు కాదు, దానిని వేస్తే అది మనకు, మనమే తగిలించుకున్నాము అనుకుంటారు జనం అని నిరాకరించారట. అయినా పట్టు వదలని పుండరీకాక్షయ్య, ఆ బిరుదు స్వామిజి నోట దైవికంగా వచ్చిన బిరుదు ,ఇంతకంటే గొప్ప బిరుదు ఏముంటుంది అని పుండరీకాక్షయ్య వాదించారు, దానితో యెన్.టి.ఆర్. కొంత మెత్త పడ్డారట, ఆలా ఆరాధన చిత్రం తో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యారు యెన్.టి.ఆర్. యెన్.టి.ఆర్ ని వెతుక్కుంటూ బిరుదులు, పదవులు వచ్చాయి కానీ వాటి కోసం ఆయన ఎప్పుడు వెంపర్లాడ లేదు. పదవులకు, బిరుదులకు అయన వలన వన్నె పెరిగింది కానీ, వాటి వలన ఆయన ప్రసిద్ధులు కాలేదు..!!