
మనసు కవి ఆత్రేయ గారు, వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఏడిపించేవారు అనేది ఒక సినీ నానుడి. మనసు మీద అయన వ్రాసినన్ని పాటలు మరెవరు వ్రాసి ఉండరు. టైం కి పాటలు, వ్రాయకుండా ఆయన నిర్మాతలను ఎలా ఏడిపించే వారు అనేందుకు చాల ఉదాహరణలు ఉన్నాయి, అందులో మచ్చుకి, ఒక అనుభవం. డైరెక్టర్ పి. పుల్లయ్య గారు, ఆత్రేయ గారు మంచి స్నేహితులు, ఎంత అంటే, ఒకరిని ఒకరు బండ బూతులు తిట్టుకొనేంత. పుల్లయ్య గారు అక్కినేని హీరో గ మురళీకృష్ణ అనే చిత్రం నిర్మిస్తున్న సందర్భంలో, హీరో విధిలేని పరిస్థితుల్లో హీరోయిన్ ను వదలి వెళ్ళిపోతాడు, ఆ సందర్భానికి తగిన ఒక విషాద గీతం వ్రాయవలసిన ఆత్రేయ గారు ఎన్ని రోజులు గడిచిన, పాట ఇవ్వక పోవటం తో పుల్లయ్య గారు ఆత్రేయ ఇంటికి వెళ్లి, ఆయనను కారులో ఎక్కించుకొని బయటకు తీసుకొని వెళ్లి, దారిలో బండ బూతులు తిట్టి, మధ్యలో ఆయనను కారు నుంచి దిగమని చెప్పి, ఇక నిన్ను పాట వ్రాయమని అడగను, నువ్వు ఎక్కడ ఉన్న సుఖం గ ఉండాలి వెళ్లిపో అన్నారట. వెంటనే ఆత్రేయ గారు పల్లవి దొరికింది పాట ఇచ్చేస్తాను పద అని, ” నీ సుఖమే నే కోరుతున్న, నిను వీడి అందుకే వెళుతున్న ” అనే విషాద గీతం వ్రాసి పుల్లయ్య గారి చేతిలో పెట్టారు. ఆ పాట అక్కినేని గారి నటనతో, ఘంటసాల గారి గాత్రం తో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.అప్పట్లో సందర్భానికి తగినట్లు పాటలు ఉండేవి, ఇప్పటిలాగా పాట కోసం సందర్భం క్రియేట్ చేసేవారు కాదు. అందుకే అప్పట్లో పాటలు వ్రాసి మెప్పించటం అంత వీజి కాదు.

