నాగార్జున వందో సినిమాకి చేరుకోబోతున్నారు..ఆయన చేస్తున్న `ఘోస్ట్` నాగ్ కెరీర్లో 99వ సినిమా. అంటే తదుపరి సినిమాతో సెంచరీ కొట్టేస్తారన్నమాట. వందో సినిమా అంటే మాటలా? చాలా స్పెషల్ కథ కావాలి. అందుకే తమిళ దర్శకుడు మోహన్ రాజాకు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవితో `గాడ్ ఫాదర్` రూపొందిస్తున్నారు మోహన్ రాజా..ఇప్పుడు నాగ్ వందో సినిమా కోసం ఓ కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇందులో అఖిల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. మొత్తానికి ఇది అక్కినేని మల్టీస్టారర్ అన్నమాట.
బంగార్రాజులో నాగచైతన్యతో నటించాడు నాగ్. ఇప్పుడు అఖిల్ తో చేసేస్తున్నాడు. అలా ఇద్దరినీ కవర్ చేసేశాడు..ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించబోతున్నారని తెలుస్తోంది. వందో సినిమా కాబట్టి.. రూ.100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగ్ కి అంత మార్కెట్ లేదు. అఖిల్ కలిసొచ్చినా ఇది పెద్ద మొత్తమే. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి.. వంద కోట్ల మేటర్ నిజమా, కాదా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.