వ్యవసాయ క్షేత్రంలో లభ్యమైన మృతదేహం మిస్టరీ వీడింది. మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. ఇంతకాలం వెలుగులోకి ఎందుకు రాలేదు? ఏంటా మిస్టరీ?
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం పాపిరెడ్డి గూడలో నాగార్జునకు చెందిన పొలం దగ్గర గుర్తుతెలియని మృతదేహం బయటపడిన సంగతి తెలిసిందే. అది కూడా కుళ్లిపోయిన స్టేజ్ లో ఎముకల గూడులా ఉంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించారు. విచారణ చేపట్టిన పోలీసులు మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా తేల్చారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మృతదేహం సమీపంలో లభించిన విష గుళికల ఆధారంగా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ కోణంలో దర్యాప్తు చేయగా అసలు విషయం బయట పడింది. పాపిరెడ్డిగూడకు చెందిన చాకలి జంగమ్మ, అంజయ్య దంపతులకు నలుగురు కుమారులు. వారిలో ఇద్దరు కొడుకులు పాండు(30), కుమార్ లు చాలా సన్నిహితంగా ఉండేవారు.
అయితే 2016లో కుమార్ కిడ్నీ సమస్యతో మరణించడంతో పాండు కుమిలిపోయాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకుంటానని తరచూ కుటుంబసభ్యులతో, స్నేహితులతో చెప్పేవాడట. 2016 డిసెంబర్‌లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ లెటర్ రాసి ఇంటి నుండి వెళ్లిపోయాడట. అప్పటినుండి కనిపించకుండా పోయిన అతడిపై కుటుంబ సభ్యులు ఎలాంటి కంప్లైంట్ చేయకపోవడంతో అతడిని వెతికే ప్రయత్నాలు జరగలేదు.
పాండు ఎక్కడికో వెళ్లిపోయి సూసైడ్ చేసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. ఏళ్లు గవడంతో ఈ విషయం మరుగున పడింది. తాజాగా నాగార్జునకి చెందిన ఎన్ ఆగ్రోఫామ్ పొలంలో పనులు చేస్తున్న వారికి పాండు మృతదేహం కనిపించింది. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు అతడిని పాండుగా గుర్తించారు. అతడి వేలికి ఉంగరం, మెడలోని గొలుసు, కర్చీఫ్, చెప్పులను బట్టి అతడిని పాండుగా కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.