సీనియర్ నటుడు బాలయ్య గారు 1930 ఏప్రిల్ 9 వ తేదీన జన్మించారు, 2022 ఏప్రిల్ 9 వ తేదీన అంటే, తన 92 వ జన్మదినం రోజున ఆయన మరణించటం అత్యంత విషాదకరం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా సుదీర్ఘమయిన చలన చిత్ర ప్రయాణం బాలయ్య గారిది. మృదు స్వభావి, ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వం కారణంగా ఆయన చిత్ర పరిశ్రమలో విలక్షణమయిన వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. యెన్.టి.ఆర్. తో బాలయ్య గారి అనుభవం అందుకు ఒక చక్కటి ఉదాహరణ.
యెన్.టి.ఆర్. తో కలసి చాలా చిత్రాలలో నటించారు బాలయ్య. యెన్.టి.ఆర్. కాంత రావు నటించిన “ప్రమీలార్జునీయం” చిత్రం చుసిన బాలయ్య గారు యెన్.టి.ఆర్. ను కలవటం కోసం అయన ఇంటికి వెళ్లారు. “ప్రమీలార్జునీయం” చిత్రంలో యెన్.టి.ఆర్. అర్జునిడిగా,కాంత రావు కృష్ణుడిగా నటించారు., బాలయ్య గారు వెళ్లే సరికి అక్కడ చాలా మంది, ప్రమీలార్జునీయం చిత్రం గురించి తెగ పొగిడేస్తున్నారట, అది వింటూ మౌనంగా కూర్చున్న బాలయ్య గారిని చూసి , ఏం బ్రదర్ సినిమా ఎలా ఉంది అని బాలయ్య ను అడిగారట యెన్.టి.ఆర్.
ఏమి బాగా లేదు సర్, కృష్ణుడి కనుసన్నలలో నడిచే పాత్ర అర్జునిడిది, అటువంటి పాత్ర మీ ఇమేజ్ కు భిన్నంగా ఉంటుంది, అందుకే నాకు నచ్చలేదు అని నిర్మొహమాటంగా చెప్పేశారట బాలయ్య. ఎస్ యు అర్ రైట్ బ్రదర్, ప్రేక్షకులు కూడా అటువంటి అభిప్రాయమే వెలిబుచ్చారు, మీ సూచనను దృష్టిలో పెట్టుకుంటాను అన్నారట యెన్.టి.ఆర్. అంతటి విలక్షణమయిన మనస్తత్వం బాలయ్య గారిది, అందు వలెనే బాలయ్య గారు సినీ పరిశ్రమలో అందరితో మంచి సంబంధ, బాంధవ్యాలు కలిగి ఉండేవారు.