మొదటి తరం నటి నటులు అందరు నెల జీతం తీసుకొని సినిమాలకు పని చేసే వారు. ఎస్.వి.ఆర్, యెన్.టి.ఆర్,ఏ.యెన్.ఆర్,రేలంగి, సావిత్రి, సూర్యకాంతం వంటి సీనియర్ నటులు అందరు నెల జీతం మీద పని చేసిన వారే. ఈ జీతాలకు సంబంధించి, విజయ వారు మిస్సమ్మ చిత్రం నిర్మిస్తున్నపుడు ఒక ఆసక్తికరమయిన సంఘటన జరిగింది. మిస్సమ్మ లో నటిస్తున్న యెన్.టి.ఆర్. కి 75 రూపాయలు, ఏ.యెన్.ఆర్. 30 రూపాయలు సావిత్రి కి 70 రూపాయలు , రేలంగి కి 55 , జమునకు 45 , ఇలా ఈ మొత్తాన్ని ఒకే చెక్ రాసి అన్నగారి చేతిలో పెట్టి అందరు తీసుకోండి అని చెప్పారట. జమున, అక్కినేని, రేలంగి, ముగ్గురు వారి,వారి డబ్బులు తీసుకొని వెళ్లిపోయారట..
చివరకు మిగిలిన డబ్బులో చిల్లర లేక సావిత్రి 5 రూపాయలు ఎక్కువ తీసుకొని, రేపు కలసి నప్పుడు ఇస్తానని మిగతా డబ్బు యెన్.టి.ఆర్. చేతిలో పెట్టి వెళ్లిపోయారట. ఆ తరువాత నెల రోజుల వరకు సావిత్రి వేరే షూటింగ్లో ఉంటూ యెన్.టి.ఆర్. ని కలవలేదట. ఈ లోపు అన్నగారి దగ్గర డబ్బులు నిండుకున్నాయి, డబ్బుకి కట,కట, ఏదయితే అదయిందని సావిత్రి రూమ్ వెతుక్కొని వెళ్లి తన 5 రూపాయలు అడిగి తెచ్చుకున్నారట యెన్.టి.ఆర్. యెన్.టి.ఆర్. క్లాస్ మెట్, సహా నటుడు ఐన జగ్గయ్య గారు యెన్.టి.ఆర్ అంతటి వాడికే డబ్బులకు ఇబ్బంది తప్ప లేదు అని చెప్తూ ఈ సంఘటన గురించి చెప్పేవారట..!!