మధుర గాయకుడు ఘంటసాల గారి గాత్రం నేపధ్య గానానికి పనికి రాదనీ తిరస్కరించిన విషయం మీకు తెలుసా? 1944 లో సినీ రంగంలో నేపధ్య గాయకుడిగా స్థిరపడాలని అప్పటి మద్రాసు నగరం చేరిన ఘంటసాల గారు, అప్పటి ప్రముఖ గ్రామ ఫోన్ రికార్డింగ్ కంపెనీ అయినటువంటి హెచ్.ఏం.వి. వారు నిర్వహించిన వాయిస్ టెస్టింగ్ కు వెళ్లారు, ఆయన వాయిస్ విన్న హెచ్,ఏం.వి. కంపెనీ ప్రతినిధి లంక కామేశ్వర రావు, ఘంటసాల గారి గాత్రం “మెటాలిక్ వాయిస్” రికార్డింగ్ కి పనికి రాదని చెప్పి పంపించి వేసారట. ఆ” మెటాలిక్ వాయిస్” తరువాతి కాలం లో “గోల్డెన్ వాయిస్” గ తెలుగు సినీ రంగాన్ని శాసించింది, తెలుగు వారికి భగవద్గీతను ప్రసాదించింది. ఆయనకు ఇతర భాషలలో పాడే అవకాశాలు వచ్చిన అక్కడి గాయకుల భుక్తికి తానూ ప్రమాదంగా మారకూడదు అనే సదుద్దేశం తో, ఇతర భాషలలో పాడకూడదు, అని నిర్ణయించుకున్నారు, లేకుంటే ఆయన జాతీయ స్థాయిలో గాయకుడిగా గుర్తింపు పొంది ఉండేవారు.
నటుడు, దర్శకుడు, అయిన, పేకేటి శివరాం గారు హెచ్.ఏం.వి. సంస్థ తెలుగు విభాగం లో చేరగానే ఘంటసాల గారిని పిలిచి ఒక ప్రైవేట్ గీతాన్ని, ఒక పద్యాన్ని రికార్డు చేయించారు, 1945 మే నెలలో విడుదల అయిన ఆ రికార్డు నెంబర్ యెన్ 18795 . తెలుగునాట ఘంటసాల వారి గాత్రం మారుమ్రోగింది ఏ వాయిస్ అయితే రికార్డింగ్ కి పనికి రాదనీ, ఎవరైతే తిప్పి పంపారో అదే లంక కామేశ్వర రావు గారు నిర్మించిన “టైగర్ రాముడు” అనే చిత్రానికి ఘంటసాల గారే సంగీత దర్శకుడు. ప్రతిభకు గుర్తింపు రావటం కాస్త ఆలస్యం కావచ్చు ఏమో గని , ఎవరు ఆప లేరు అనేటందుకు ఇదొక చక్కటి ఉదాహరణ. తెలుగు సినీ సంగీతాన్ని, నేపధ్య గానాన్ని, కొత్త పుంతలు తొక్కించి, పౌరాణిక చిత్రాలలోని పద్యాలకు సరళతను జోడించి, వినసొంపుగా మార్చిన ఘనత ఘంటసాల వారికే దక్కుతుంది. అందుకే ఘంటసాల “అమర గాయకుడు”, తెలుగు వారు గర్వంగా చెప్పొకోగలిగిన పేరు ఘంటసాల!!!