మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్ గా మొదటి సారి చేసిన షో మాస్టర్ చెఫ్. జెమిని టీవీ ఈ షో ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించడం జరిగింది. తమన్నాకు భారీ పారితోషికం ఇవ్వడంతో పాటు జడ్జ్ లకు పెద్ద మొత్తంలో పారితోషికాలు ఇస్తూ షో ను భారీ ఎత్తున నిర్వహించారు..షో కు రేటింగ్ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ప్రయోజనం దక్కలేదట. పెట్టిన పెట్టుబడికి కనీసం సగం కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోవడంతో ఇక చేసేది లేక తమన్నా ను షో నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి.
ఆమె పారితోషికం భారీ మొత్తంలో ఉండటం వల్ల ఆమెకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ ముగించి తదుపరి ఎపిసోడ్స్ కు గాను జబర్దస్త్ యాంకర్ అనసూయను రంగంలోకి దించడం జరిగింది. మాస్టర్ చెఫ్ హోస్ట్ మారడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. తమన్నా ప్లేస్ ను అనసూయ భర్తీ చేసింది అంటే పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. షో యూనిట్ సభ్యులు మాత్రం తమన్నా కాల్షీట్లు లేని కారణంగా చివరి ఎపిసోడ్స్ ను అనసూయతో చేయిస్తున్నామని చెబుతున్నారు.
కాని అసలు విషయం ఆమె షెడ్యూల్స్ ప్రకారం పారితోషికంను తీసుకుంటుంది. ఇటీవల ప్రసారం అయిన ఎపిసోడ్స్ తో ఆమె షెడ్యూల్ షూటింగ్ ముగిసింది. మళ్లీ కొత్త షెడ్యూల్ వేసి చిత్రీకరణ చేయాలంటే ఆమెను ఆహ్వానించాలి. అందుకు భారీగా పారితోషికం కావాల్సి వస్తుంది. అందులో కొద్ది మొత్తంకే అనసూయ వచ్చేస్తుంది కనుక ఈ మార్పు జరిగింది అనేది జెమిని వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.