వృత్తిలో తీరిక లేనప్పుడు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేం. దాదాపు సెలబ్రిటీలు అందరికీ ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. తాను మాత్రం ఈ రెండు సందర్భాలను వేరుగా చూశానంటోంది బాలీవుడ్ భామ మాధురీ దీక్షిత్. వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్ని విడిగా ఉంచడం వల్లే ఇన్నేళ్లుగా రెండింటిలో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. 90వ దశకంలో అగ్రతారగా బాలీవుడ్‌ను ఏలింది మాధురీ. అప్పటిదాకా ఉన్న శ్రీదేవి స్థానాన్ని ఆక్రమించింది. తాజాగా ఆమె తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘ఫేమ్ గేమ్’ విడుదలైంది.
ఈ సందర్భంగా మాధురీ మాట్లాడుతూ…‘నటించడం, డాన్సులు చేయడం నాకిష్టం. రోజూ కెమెరా ముందుకు వెళ్లడాన్ని ప్రేమిస్తాను. నాకొచ్చిన సెలబ్రిటీ హోదా ఇష్టమైన పని చేస్తున్నందుకు వచ్చిన బహుమతిగా భావిస్తా. స్టార్‌డమ్ నేనేంటో చెప్పదు. షూటింగ్ లేనప్పుడు నా కుటుంబంతో సమయం గడుపుతా. నా పిల్లలు ఏం చేస్తున్నారో చూడటం ముఖ్యం అనుకుంటా’ అని చెప్పింది. కనిపించకుండా పోయిన ఒక ప్రముఖ నటిని వెతికే క్రమంలో జరిగిన ఆసక్తికర ఘటనలతో ‘ఫేమ్ గేమ్’ రూపొందింది.