తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని వారు, తెలుగు సినీ పరిశ్రమలో యెన్.టి.ఆర్. సహాయం పొందని వారు ఉండరేమో అనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు, పరోపకారి పాపన్న లాగా యెన్.టి.ఆర్. ఎంతో మంది పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ, సహకారాలనందించారు. అవసరార్ధం వచ్చిన వారికి సహాయం చేయటం ఒక ఎత్తు, ఎదుటి వారి టాలెంట్ ను గుర్తించి వారు అడగకుండానే వారికి సహాయం చేయటం యెన్.టి.ఆర్. నైజం. రాముడు, కృష్ణుడు అనగానే యెన్.టి.ఆర్. నారదుడు అనగానే కాంత రావు గుర్తుకు వచ్చినట్లు, శకుని అనగానే గుర్తుకు వచ్చే నటుడు ధూళిపాళ్ల. అసలు ఆ పాత్ర ఆయనకు రావటానికి కారణం యెన్.టి.ఆర్. ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన “శ్రీ కృష్ణ పాండవీయం” చిత్రంలో అయన సుయోధనుడు పాత్ర పోషిస్తూ, శకుని పాత్రను ప్రత్యేకం గ రాయించారు, ఆ చిత్రం లో శకుని పాత్రలోని అండర్ కరెంటు రివెంజ్ కి కారణం ఏమిటో చూపించారు. ఆ పాత్ర ఎవరిని వరిస్తుందో అని అందరు ఎదురు చూస్తున్న సందర్భం లో యెన్.టి.ఆర్. వద్ద నుంచి దూళిపాళ్ల కు పిలుపు వచ్చింది..
ఎంతో ఉత్కంఠగా వెళ్లిన దూళిపాళ్ళను చూసి, రండి బ్రదర్ అంటూ ఆహ్వానించి, రెండు ఫైల్స్ చేతిలో పెట్టి మా చిత్రంలో శకుని మామ మీరే అన్నారట. అడగకుండానే దేవుడు వరమిచ్చినంత సంతోషించారట ధూళిపాళ్ళ. మరుసటి రోజు సెట్ లోకి వెళ్ళగానే ఏం బ్రదర్ ఎలా ఉన్నాడు మన శకుని మామ అనగానే, మీరు ఎలా చెపితే ఆలా చేస్తాను సర్ అన్నారట ధూళిపాళ్ళ, మేము చెప్పటం ఏమిటి? శకుని మామే మాకు చెప్పాలి!!! అనగానే విషయం అర్ధం చేసుకున్న ధూళిపాళ్ళ, మెడ వంకరగా పెట్టి, ఒక కనుబొమ పైకి లేపి, ” అయిన వాడిని, అమ్మ తమ్ముడిని నేనున్నానుగా” అంటూ కుడి చేతిలో దండాన్ని తిప్పుతూ డైలాగు చెప్పగానే సెహబాష్ శకుని మామ అన్నారట యెన్.టి.ఆర్. అంతే అప్పటి నుంచి యెన్.టి.ఆర్. నటించిన పౌరాణిక చిత్రాలలో శకుని పాత్రకు ధూళిపాళ్ళ పర్మనెంట్ ఆర్టిస్ట్ అయి పోయారు. టాలెంట్ ను గుర్తించి వారికీ తగిన అవకాశం కల్పించి ఎందరికో ఫ్యూచర్ ఇచ్చారు యెన్.టి.ఆర్. అందుకే ఆయన మొక్కకుండానే వరాలిచ్చిన వెండి తెర వేంకటేశ్వరుడు..!!