ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలన్న గుణం ఉండాలేగానీ.. ఎక్కడ ఉన్నా మనవంతు చేయూత అందించవచ్చు. ఇప్పుడు ప్రముఖ నటి కృతిశెట్టి కూడా ఇదే బాటలో నడుస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా కృతిశెట్టి కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను మొదలు పెట్టింది. ‘నిష్న- ఫీడ్ ది నీడ్’ పేరుతో ఎన్టీఓను ప్రారంభించింది. తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను నెలకొల్పినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కృతిశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ ద్వారా తెలిపింది.
సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఏడాది అయిన సందర్భంగా ఎన్నో విషయాలు వెల్లడించింది కృతి. తన కెరీర్ తో పాటు వ్యక్తిగతంగానూ పలు విషయాలను తెలుసుకున్నట్లు తెలిపింది. కష్టాల్లో ఉన్నవారికి ఏదైనా సాయం చేయాలనే లక్ష్యంతోనే స్వచ్ఛంద సంస్థను స్థాపిస్తున్నట్లు తెలిపింది. అందరూ తమ సంస్థకు అండగా నిలవాలని కోరింది. తన బర్త్ డే సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది కృతి. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేపట్టాలని పిలుపునిచ్చింది..!!