మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదలైన నేపథ్యంలో రాజేష్ మండూరి అనే వర్థమాన రచయిత ఈ మూవీ స్టోరీ తనదే అని ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చాడు. తాను రాసుకున్న ‘పెద్దాయన’ కథని రెండేళ్ల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వారికి వినిపించానని.. ఇప్పుడు అదే స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్ తో స్నేహంగా ఉండే కొరటాల శివ సినిమా చేస్తున్నాడని ఆరోపించాడు.
దీనిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలను కూడా కలిశానని.. తెలుగు రచయితల సంఘానికి కంప్లైంట్ చేసానని.. కానీ వారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ లీగల్ గా వెళ్లాలని సలహా ఇచ్చారని పేర్కొన్నాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన ‘ఆచార్య’ మూవీ మేకర్స్ – మైత్రీ మూవీ మేకర్స్ – కొరటాల శివ లు రాజేష్ ఆరోపణలను ఖండించారు. స్వయంగా రాజేష్ మండూరి తో న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ లో మాట్లాడిన కొరటాల శివ.. ‘ఆచార్య’ స్టోరీ మీరు చెప్తున్నది కాదని.. మీరు మీ కథతో సినిమా తీసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. ఈ డిబేట్ లో కాస్త అసహనానికి లోనైన కొరటాల అవసరమైతే ఈ ఇష్యూ పై కోర్టుకు వెళ్తానని పేర్కొన్నాడు.