జానపద బ్రహ్మ విఠలాచార్య తో కలహాల కాపురం చేసిన కత్తి వీరుడు కాంత రావు. కాంత రావు గారిని జానపద హీరోగా నిలబెట్టింది విఠలాచార్య అయినప్పటికీ, కాంత రావు కెరీర్ ని ఒక విధం గ చెడగొట్టింది విఠలాచార్య వారే అనే అభిప్రాయం కాంత రావు గారికి ఉండేది. చిన్న బడ్జెట్ సినిమాలు తీసే విఠలాచార్య, కాంత రావు గారికి ఇచ్చే పారితోషికం గీసి, గీసి ఇచ్చేవారు, అంతే కాకుండా ఇతర నిర్మాతలు ఎవరయినా ఎక్కువ ఇస్తే వారి వద్దకు వెళ్లి, ఏవండీ కాంత రావు పారితోషికం ఇంతే, అంత కంటే ఎక్కువ ఇవ్వకండి, మీరు ఎక్కువ ఇస్తే అతను కొండెక్కి కూర్చుంటాడు నా లాంటి చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండడు, అనిచెప్పి చెడగొట్టే వారట. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనే సామెత చెప్పినట్లు ఉండేదట కాంత రావు పరిస్థితి. ఈ క్రమంలోనే నవగ్రహ పూజ మహిమ చిత్రంలో నటిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య చిన్న యుద్ధమే జరిగిందట, పారితోషికం గురించి కాదు” కాకి” వలన.
ఆ చిత్రంలో పురూరవ మహారాజు పాత్ర పోషిస్తున్న కాంత రావు గారిని కథ ప్రకారం ఒక సీన్ లో కాకి వచ్చి తల మీద కొట్టే సీన్ తీస్తున్నారట విఠలాచార్య, ” కాకి” తల మీద కొట్టటం అశుభంగా భావిస్తారు, అందుకని ఆ సీన్ డూప్ ని పెట్టి తీయమన్నారట కాంత రావు, కాకి తల మీద తంతేనే దరిద్రం అంటుకుంటే, దానిని పట్టుకొని మీ మీదకు వదల వలసిన నాకెంత దరిద్రం పట్టుకోవాలి అదేమీ కుదరదు ఈ సీన్ లో నటించవల్సిందే అని మొండి పట్టు పట్టారట విఠలాచార్య. తప్పని పరిస్థితుల్లో ఆ సీన్ లో నటించారట కాంత రావు గారు. తన చిత్రాలలో నటించే హీరోల జాతకం చూసి మరి అవకాశం ఇచ్చేవారట విఠలాచార్య, అటువంటి ఆయన కాంత రావు గారిని ఈ విధంగా హింసించటం అన్యాయం కదూ? అయినా ఏం చేస్తారు , కాంత రావు గారి అవసరం అటువంటిది పాపం. కాకి తన్నటం వలనో, అవునో , కాదో తెలియదు కానీ కాంత రావు కెరీర్ మాత్రం సజావుగా సాగలేదు అనేది మాత్రం వాస్తవం. ఒక నిర్మాత వలన హీరో ఇంతగా ఇబ్బంది పడటం దురదృష్టకరం..!!