కమల్ త్వరలోనే ఫ్యాషన్ బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నాడు. ఇందులో ఒక మంచి ప్రయోజనం ముడి పడి ఉంది. గొప్ప నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థికంగా బలపడలేకపోతున్న చేనేత కార్మికులకు అండగా నిలిచే ప్రయత్నంలో భాగంగా కమల్ ఈ వ్యాపారం మొదలుపెడుతున్నాడు. ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ పేరుతో కమల్ కొత్త బ్రాండును పరిచయం చేయబోతున్నాడు. చేత్తో నేసిన బట్టలు, ఇతర వస్తువులను ఆ బ్రాండ్ నేమ్‌తో అందించనున్నాడు కమల్. విశేషం ఏంటంటే.. ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ తొలి స్టార్ ఆరంభం కాబోయేది ఇండియాలో కాదు..
అమెరికాలో. ఆ దేశంలోని చికాగోలో త్వరలోనే ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ తొలి దుకాణాన్ని కమల్ ప్రారంభించబోతున్నాడట. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమృత రామ్ డిజైన్లతో తొలి స్టార్ ఆరంభం కానుంది. ఖాదికి మన దేశ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం ఉందని, అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా అందమైన దుస్తులను అందించబోతున్నామని, ఖాదీని నగర యువతకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ బ్రాండ్ మొదలుపెడుతున్నామని కమల్ ప్రకటించాడు. త్వరలో భారత్‌లోనూ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ స్టోర్లు తెరవడానికి కమల్ ప్రణాళికలు సిద్ధం చేశాడు.