ఓకల్పనా రాయ్ కధ, అసలు పేరు సత్యవతి, పుట్టింది కళలకు కాణాచి అయిన కాకినాడ లో పుట్టుకతో ధనవంతురాలు, వెండి పళ్లెం లో పంచ భక్ష, పరమాన్నాలతో పెరిగిన కల్పనా రాయ్ ఉరఫ్ సత్యవతి, నాటక రంగం లో, సినీ రంగం లో ఉన్నదంతా పోగొట్టుకొని ఏకాకి గ, అతి దుర్భరమయిన జీవితం అనుభవించి, తనువు చాలించారు. యవ్వనం లో తాను నాటకాలలో నటించటానికి బయలు దేరితే ఆ వీధి, వీధి అంత సెంటు వాసన గుభాళించేది, ఆమెను చూడటానికి ఆడ, మగ పనులు మానుకొని ఎదురు చూసే వారట. ఎదుటి వారి కష్టాన్ని తన కష్టం గ భావించి, హ్యాండ్ బాగ్ లో ఉన్న పది రూపాయాల కట్టలు ఇవ్వటమే కాదు, అవి సరిపోవు అనుకుంటే తన వంటి మీద నగలు కూడా తీసి ఇచ్చేసే దానశీలి కల్పనా రాయ్. శారద సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో హీరోయిన్ శారద గారికి ఆతిధ్యం ఇచ్చిన ధనవంతు రాలు, నటన పై ఉన్న మక్కువతో, శారద గారి ప్రోత్సాహం తో సినీ రంగ ప్రవేశం చేసారు, తన పేరుని కల్పనా గ, తనని మోసం చేసి నగలతో ఉడాయించిన భర్తకు గుర్తుగా రాయ్ అనే తోకను తగిలించుకొని కల్పనా రాయ్ అయింది..
చేసింది చిన్న, చిన్న పాత్రలే అయినా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు కల్పనా రాయ్. తన సహజమయిన దాన గుణం, అందరికి వండి తినిపించే సరదా, వలన కల్పనా రాయ్ ఎంతో పాపులర్ అయ్యారు . సినీ రంగం గురించి మనకు తెలియంది ఏముంది, ఈమె అమాయకత్వం ఆసరా చేసుకొని, తన చుట్టూ ఉన్న వారు ఆమెకు తీరు క్షవరం చేసారు, సినీ రంగం లో సంపాదించిన దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. ఏది ఎలా ఉన్న తన కూతురు కోసం బతికింది, అదే కూతురు అవసరం తీరాక, దూరంగా వెళ్ళిపోయింది, గుండ్రాయి లాంటి కల్పనా రాయ్ ఒక్కా సారిగా కూలి పోయింది, ఆరోగ్యం క్షిణించింది, చివరికి వెయ్యికి, రెండు వేలకి పాత్రలు చేసింది, ఎవరిని చేయి చాచి అడగలేక, అనారోగ్యం తో ఉన్న తనను చూసుకొనే వారు లేక, చివరకు ఆమె చనిపోయిన రెండు రోజులకు గాని ఆ వార్త బయట ప్రపంచానికి తెలియ లేదు. ఎంతో ఘనంగా బ్రతికిన కల్పనా రాయ్, చివరకు అనాధ శవం అయింది. ఇటువంటి కొందరు నటి, నటులను చూసినప్పుడు అనిపిస్తుంటుంది, వీరంతా శాపగ్రస్తులు అయిన గంధర్వులేమో? శాప విమోచన కోసం ఇలా జన్మించారేమో? అనిపిస్తుంటుంది. హత విధి!!!