టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు. ఆయన స్పృహలోకి వచ్చినట్లుగా వెల్లడించారు. రక్తపోటు తగ్గిందని.. కిడ్నీ పనితీరు మెరుగుపడిందని పేర్కొన్నారు. వెంటిలేటర్ మద్దతును నెమ్మదిగా తగ్గిస్తున్నామన్నారు. ఈరోజు GI ట్రాక్ట్ నుండి రక్తస్రావం లేదని.. రోగి ICUలో ఉన్నారని తెలిపారు. కనీస మద్దతుతో పరిస్థితి మెరుగుపడుతోందని అన్నారు. త్వరలో మరింత ఆరోగ్యంగా మారుతారని హెల్త్ బులిటన్‌లో పేర్కొన్నారు.
ఇక కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఆయన కూతురు రమాదేవి స్పందించారు. మీడియాకు ఆడియో టేపును పంపించారు. వేగంగా కోలుకుంటున్నారని.. ఆరోగ్య పరిస్థితి బాగుందన్నారు. అందరితో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందక్కర్లేదని.. దయచేసి అనవసర వార్తలను ప్రచారం చేయవద్దని అన్నారు. తప్పుడు వార్తలు అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తాయన్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.