టాలీవుడ్‌లో మరో పెను విషాదమిది. దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం అర్థరాత్రి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. కళాత్మక చిత్రాలతో తెలుగు సినిమాకి వన్నె తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. చెన్నైలోని ఒక స్టూడియో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని ఆరంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. శంకరాభరణం, సాగరసంగమం, శృతి లయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వాతిముత్యం లాంటి ఎన్నో అపురూప చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఆయన నుంచి సినిమా వస్తే.. అవార్డుల పంటే. కమర్షియల్‌గానూ గొప్ప విజయాల్ని అందుకొన్నాయి. శంకరాభరణం ఓ క్లాసిక్. ఆ సినిమా అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని అందుకొంది. దర్శకుడిగానే కాదు.. నటుడిగా కూడా తన విలక్షణత చాటారు. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు. కె.విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె మండంలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వత్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి 2016లో సినిరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన మరణంతో ఒక దిగ్గజాన్ని కోల్పోయినట్లయింది..!!