కృష్ణ గారు తనకు తెలియకుండానే తెలుగు దేశం పార్టీ కి ఎన్నికల ప్రచారం చేసిన ఒక చిత్రమయిన సంఘటన జరిగింది. హీరో కృష్ణ గారి 100 వ చిత్రం అల్లూరి సీతారామ రాజు 1974 లో సూపర్ డూపర్ హిట్, ఎన్నో రికార్డులు సృష్టించింది.ఆ తరువాత 8 సంవత్సరాలకు అంటే 1982 వరకు కృష్ణ గారు ఇంకొక 99 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. తన 200 వ చిత్రం కూడా ప్రతిష్టాత్మకం గ ఉండాలని కధ కోసం వెతుకుతున్నారు, మలయాళ చిత్రం కధ నచ్చి ఆ చిత్రాన్ని తన 200 వ చిత్రం గ “ఈనాడు” చిత్రాన్ని తెరకెక్కించారు పద్మాలయ సంస్థ పేరు మీద. కృష్ణ గారు ప్రజా నాట్య మండలి ఉత్తమ కధా నాయకుడుగా సినీ రంగ ప్రవేశం చేసారు.
ఈనాడు చిత్రంలో ఆయన పోషించిన పాత్ర వామపక్ష భావజాలం కలిగిన ప్రజా నాయకుడి పాత్ర. కృష్ణ గారి కెరీర్ లో హీరొయిన్ లేకుండా, డ్యూయెట్ లేకుండా నటించిన చిత్రం ఇదే, అప్పటికి. ఈనాడు చిత్రం 1983 ఎన్నికలకు ముందు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం లో హీరో కృష్ణ గారు ” రండి కదలి రండి ” అని పాడుతూ సైకిల్ మీద తిరుగుతూ ప్రజలను సమాయత్తం చేస్తారు. తెలుగు దేశం పార్టీ ఎన్నికల గుర్తు కూడా “సైకిల్” కావటం తో, కృష్ణ గారు ఇండైరెక్ట్ గ తెలుగు దేశం పార్టీ కి తన మద్దతు తెలిపినట్లు అయ్యింది. ఆ విధంగా తనకు తెలియకుండానే తన ఆరాధ్య నాయకుడికి ప్రచారం చేసి పెట్టారు కృష్ణ గారు. సినిమా సూపర్ హిట్, తెలుగు దేశం పార్టీ కూడా సూపర్ డూపర్ హిట్.