సంచలనాలకు నిలయం అయిన ” మాయ బజార్ ” చిత్రంలో రేలంగి గారి మీద చిత్రికరించిన,” సుందరి నీ వంటి దివ్య స్వరూపము ” అనే పాట ఇద్దరు గాయకుల చేత పాడించారు దానికి కారణం ఏమిటో తెలుసా ? మొదట ఈ పాటను పిఠాపురం నాగేశ్వర రావు గారితో పాడించారు, అచ్చం రేలంగి గారు పాడినట్లే ఉంది. ఆ పాటను విన్న దర్శకుడు కే.వి.రెడ్డి గారు, సంగీత దర్శకుడయిన ఘంటసాల గారిని పిలిచి ఈ పాటను మీరు కూడా ఒక సారి పాడి రికార్డు చేయండి నేను విన్నాక, అప్పుడు ఫైనలైజ్ చేద్దాము అని చెప్పారట. ఒకింత ఆశ్చర్యానికి గురి అయిన ఘంటసాల గారు చేసేదేమి లేక తాను కూడా ఆ పాటను పాడి కే.వి. రెడ్డి గారికి వినిపించారట.
కే.వి. రెడ్డి గారు ఘంటసాల గారు పాడిన పాటను చిత్రంలో పెట్టడానికి నిర్ణయించారట. అప్పుడు ఘంటసాల గారు కే.వి. రెడ్డి గారిని అడిగారట, రెండు పాటలలో తేడా ఏమిటండి అని. ఇద్దరు గొప్పగా పాడారు కానీ, పిఠాపురం పాడిన పాట రేలంగి పాడినట్లు ఉంది, మీరు పాడిన పాట లక్ష్మణ కుమారుడు పాడినట్లు ఉంది. మనకు నటులు ముఖ్యం కాదు, పాత్రలు ముఖ్యం, అందుకే మీరు పాడిన పాటను ఫైనలైజ్ చేశాను అన్నారట. పాత్రల ఔచిత్యాన్ని బట్టి గాత్రం ఉండాలి తప్ప, నటుల్ని బట్టి కాదు అనే గొప్ప సత్యాన్ని చాటారు దర్శక దిగ్గజం కే.వి.రెడ్డి గారు.