పదమూడేళ్ల చిరు ప్రాయం లో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఇంటి నుంచి పారిపోయిన ఘంటసాల. మచిలీపట్టణం లో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో స్టేజి మీద పాడటానికి ప్రయత్నించిన ఘంటసాల ను స్టేజి మీద నుంచి గెంటేశారట అక్కడి నిర్వాహకులు. తనకు శాస్త్రీయ సంగీతం రానందుకు వారల అవమానించారు అని తలచిన ఘంటసాల తన వేలికి ఉన్న ఉంగరం అమ్మేసి వచ్చిన 12 రూపాయలు, ఒక జత బట్టలతో ట్రైన్ ఎక్కేసారట, ఎక్కడికి మద్రాస్ కు కాదండి, సంగీతానికి, కళలకు నిలయం అయిన విజయనగరానికి. అప్పట్లో అక్కడ మాత్రమే సంగీత కళాశాల ఉండేది, అందులో చేరి సంగీతం నేర్చుకోవాలి అనే ఉద్దేశం తో విజయనగరం చేరారు ఘంటసాల. రోజు కళాశాల గేట్ దగ్గర తచ్చాడుతున్న కుర్ర వాడిని చుసిన వారడిగితే సంగీతం నేర్చుకోవటానికి వచ్చాను అని చెప్పారట, అయితే పట్రాయని సీతారామ శాస్ట్రీ గారిని కలవమన్నారట, వారి ఇల్లు వెతుక్కొని వెళ్లిన ఘంటసాల పట్టుదలను చూసి నీవు రేపు కాలేజికి రా అన్నారట, ఆ తరువాత ఎక్కడ ఉంటావు అని అడిగితే నీళ్లు నములుతున్న కుర్ర వాడిని చూసి, మా వరండాలో ఉండు, ఈ పూటకు భోజనం పెడతాను రేపటి నుండి నీ భోజనం వసతి నువ్వే చూసుకోవాలి అని చెప్పారట…
మరుసటి రోజు తన వెంట కాలేజికి తీసుకెళ్తాను, ప్రిన్సిపాల్ గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, నిన్ను పాడమని అడుగుతారు, నీ స్వరం గాత్రానికి పనికి రాదు వయోలిన్ నేర్చుకో అంటారు, కానీ నీ గాత్రం బాగుంది, గాత్రమే నేర్చుకుంటాను అని చెప్పు అని చెప్పారట. మరుసటి రోజు కాలేజీ కి వెళ్లిన ఘంటసాల, నాయుడు గారి ని కలిశారు ఆయన పాడమనగానే, తనకు తెలిసిన తరంగాలు పాడారట, శాస్ట్రీ గారు చెప్పినట్లుగానే నాయుడు గారు నీ గాత్రం అంతగా బాగోలేదు, వయోలిన్ నేర్చుకో అన్నారట, కానీ ఘంటసాల నేను గాత్రమే నేర్చుకుంటాను అని పట్టు బట్టే సరికి, సరేనన్నారు. 19 సంవత్సరాలకే విద్వాన్ కోర్స్ పూర్తి చేసి, తిరిగి ఊరెళ్ళిపోయారు ఘంటసాల. దగ్గరి బంధువు అయిన సముద్రాల రాఘవాచారి గారు ఘంటసాల గాత్రం విని బాగుంది నీ గాత్రం, నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, మద్రాసు కు వచ్చి ప్రయత్నించు నేను సహాయం చేస్తాను మద్రాసుకు వచ్చేసేయ్ అని ఘంటసాల గారిని మద్రాసుకు తీసుకొని వచ్చారట .అలా జరిగింది గాన గంధర్వుడి చెన్నపురి ప్రవేశం..!!