30 ఏళ్ల వయసున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన అభీష్టానికి వ్యతిరేకంగా 21 ఏళ్ల వయసున్న చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ వల్ల తలెత్తే సమస్యలు.. చిన్న చిన్న గొడవలు..అలకలు..గిల్లికజ్జాల నేపథ్యంలో చాలా సరదాగా, ఆహ్లాదంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు. చాలా సహజంగా మనకు తెలిసిన వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లుగా, మనం బాగా రిలేట్ చేసుకునేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంతో ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చక్కటి విజువల్స్, వీనుల విందైన సంగీతం కూడా దీనికి ప్లస్ అయ్యాయి.
లీడ్ రోల్స్ చేసిన చైతన్య, అనన్య ఇద్దరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. ఈ సిరీస్‌కు రైటింగ్ పెద్ద ప్లస్. ప్రతి ఎపిసోడ్ చిరునవ్వులు చిందిస్తూ.. హృదయాలను తాకుతూ రోజు రోజుకూ వ్యూస్ పెంచుకుంటున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ సిరీస్ చర్చనీయాంశంగా మారింది. ఈ చిన్న సిరీస్‌కు ఇంత ఆదరణ దక్కడం మేకర్స్ సహా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఊపులో ‘30 వెడ్స్ 21’ సెకండ్ సీజన్‌ను కూడా రెడీ చేస్తుండటం విశేషం..