సాయి పల్లవి…తను ఎంత ప్రతిభావంతురాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య సాయి పల్లవి నటన ప్రేక్షకులకు మరింత బాగా నచ్చేస్తోంది. ముఖ్యంగా విరాటపర్వంలో అదరగొట్టింది. గార్గిలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో గార్గిగా సాయి పల్లవి నటన నెక్ట్స్ లెవల్ అంటున్నారంతా. మీడియాలో ఈ సినిమాపై మంచి రివ్యూలు వచ్చాయి. అంతా సాయి పల్లవి నటననే కీర్తిస్తున్నారు. ఈసారి జాతీయ అవార్డులలో ఉత్తమ నటి కిరీటం సాయి పల్లవి ఎగరేసుకుపోతుందని జోస్యం చెబుతున్నారు..ఓరకంగా… సాయి పల్లవి జాతీయ అవార్డుకు నిజంగా అర్హురాలే. అందులో ఎలాంటి అనుమానాలూ లేవు. కాకపోతే… జాతీయ అవార్డులకు ఇదొక్కటే పేరామీటర్ కాదు.
అధికారంలో ఉన్న పార్టీకి సదరు నటీనటులు ఎంత వరకూ సపోర్ట్ అనేదాన్ని బట్టే… ఈ లెక్కలు ఉంటాయి. ఇది వాస్తవం. ఆమధ్య బీజేపీకి వ్యతిరేకంగా సాయి పల్లవి కొన్ని కామెంట్లు చేసింది. అవి వివాదాస్పదమయ్యాయి. బీజేపీ నాయకులు కొంతమంది సాయి పల్లవి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కేసులు కూడా నమెదయ్యాయి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి… సాయి పల్లవి ఎంత బాగా నటించినా, ఆమెకు ఛాన్స్ ఉండకపోవొచ్చని ఓ వర్గం అంటోంది. జాతీయ అవార్డులకు చాలా సమయం ఉంది. ఈలోగా… సాయి పల్లవి చేసిన కామెంట్లను మర్చిపోయి, సాయి పల్లవికే ఉత్తమ నటి కిరీటం కట్టిబెడితే.. అది అద్భుతమే అనుకోవాలి.