విజయాధినేత చక్రపాణి గారి మీద కోపం తో ఆయన పేరును టైటిల్ గ పెట్టి సినిమా తీసిన భానుమతి గారు. విజయ సంస్థ నిర్మించిన మిస్సమ్మ చిత్రంలో హీరోయిన్ రోల్ కి మొదట భానుమతి గారిని తీసుకోవటం జరిగింది, షూటింగ్ జరుగుతున్న సమయం లో, భానుమతి గారి ఇంట్లో ఏదో వ్రతం ఉండటం తో ఆమె షూటింగ్ కి ఆలస్యంగా వస్తానని అసిస్టెంట్ డైరెక్టర్ కి చెప్పారు కానీ అతను ఆ విషయం చక్రపాణి గారికి చెప్పటం మరచిపోయాడు. క్రమ శిక్షణ విషయం లో దూర్వాసుడిగా పేరున్న చక్రపాణి గారు, షూటింగ్ కు ఆలస్యంగా వచ్చిన భానుమతి గారి మీద కోపగించుకోవడం తో, ఆత్మభిమానం మెండుగా ఉన్న భానుమతి గారు కాస్త దురుసుగా సమాధానం చెప్పే సరికి, అప్పటి వరకు తీసిన రీల్స్ ని ఆమె ముందే తగులబెట్టి, ఆమెను ఆ చిత్రం నుంచి తొలగించి సెకండ్ హీరోయిన్ అనుకున్న సావిత్రిని హీరోయిన్ గ తీసుకున్నారు చక్రపాణి.
ఈ సంఘటన తో, అవమానం తో రగిలిపోయిన భానుమతి గారు మిస్సమ్మ కు పోటీగా ఒక హాస్య చిత్రాన్ని నిర్మించారు, దానికి టైటిల్ “చక్రపాణి” అని పెట్టారు. నిజానికి ఆ చిత్రం లో హీరో గ నటించిన అక్కినేని గారి పాత్ర పేరును పెట్టారు అనుకున్నారు అందరు, కానీ అందులో హీరో పేరు చక్రపాణి కాదు, హీరో మామ గారు అంటే సి.ఎస్.ఆర్. నటించిన పాత్ర పేరు చక్రపాణి, అందులో మామ గారు చాల పిసినారి,అప్పట్లో విజయ వారి ప్రొడక్షన్ పనులు చూసే చక్రపాణి గారు బడ్జెట్ విషయం లో చాల ఖచ్చితంగా ఉండే వారు, అనవసరమయిన ఖర్చులు చేయటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు, ఆ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని, చక్రపాణి గారి మీద ఉన్న కోపం తో ఆ పాత్ర పేరును సినిమా టైటిల్ గ పెట్టి కసి తీర్చుకున్నారు భానుమతి గారు. ఆ రోజుల్లో ఈ చిత్రం టైటిల్ పెద్ద చర్చకు దారి తీసిందట!!!