బహుముఖ ప్రజ్ఞ శాలి భానుమతి గారికి హస్త సాముద్రికం లో కూడా ప్రవేశం ఉంది, ఆమెకు తెలిసిన ఈ విద్య వలన చాలా మానసిక ఆందోళనను అనుభవించారు భానుమతి గారు. సినిమా ఇండస్ట్రీ లో సెంటిమెంట్లు , నమ్మకాలూ కూసింత ఎక్కువే. జాతకాలు, ముహుర్తాలు నమ్మటమే కాదు వాటిని అధ్యయనం చేసి, నేర్చుకొని వాటిని కొంత మందికి చెబుతూండే వారు కొంత మంది విఠలాచార్య వంటి దర్శకులు, మరియు భానుమతి గారి వంటి వారు. విఠలాచార్య గారు అయితే తన చిత్రం లో నటించబోయే హీరోల జాతకం చూసి మరి తీసుకొనే వారట. సినీ రంగం లో ఎంతో మందికి ఆయన చెప్పిన ప్రెడిక్షన్స్ నిజం అయ్యాయని చేబుతుంటారు చాలామంది. కానీ భానుమతి గారు మాత్రం తనకు తెలిసిన ఈ విద్య వలన చాలా మానసిక ఆందోళనకు లోనయ్యారట ఒక సందర్భంలో. ఒక రోజు స్టూడియోలో విరామ సమయం లో తీరికగా తన గురువు గారితో మాట్లాడుతున్న భానుమతి గారి వద్దకు, తమ సొంత ప్రొడక్షన్ హౌస్ లో పని చేసే స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజు అనే వ్యక్తి వచ్చాడు, నమస్కారం గురువు గారు అంటూ తన చేయి చూసి చెప్పమని అర్ధించాడట,
ఏముందోయి నీ చేతిలో బాగానే ఉన్నావు కదా, అంటూ యధాలాపంగా అతని చేయి చూసి, నీ ఆరోగ్యం బాగుంది కదా అని అడిగారట గురువు గారు, ఆలా అంటూనే భానుమతి గారిని అతని చేయి చూడమని చెప్పారట, అతని చేయి చూసిన భానుమతి గారు ఒకింత ఆశ్చర్యానికి గురి అయి, రాజు నీ వయసు ఎంత, ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడిగారట బాగుంది మేడం, ఏదో సైనస్ వంటి చిన్న సమస్య తప్ప ఆరోగ్యం బాగానే ఉంది అంటూ వయసు కూడా చెప్పాడట, అంత బాగుంది అని అతడిని పంపించివేసి, గురువు గారు ఇతని ఆయుర్దాయం, అంటూ గొణిగారట, అంతే తల్లి మన చేతిలో ఏముంది అంత ఆ దైవేచ్ఛ! అన్నారట గురువు గారు. అతని జాతకం ప్రకారం అతనికి ఈ వయసులోనే మరణం సంభవించే అవకాశం ఉంది. అది ముందుగా తెలుసుకున్న భానుమతి గారు, ఆ విషయాన్నీ అతనికి చెప్పలేక ఎంతో మానసిక క్షోభ అనుభవించారట. ఆ తరువాత కొంత కాలానికి అతను సైనస్ సమస్య కోసం చేయించుకున్న చిన్న ఆపరేషన్ వికటించి, చిన్న వయసులోనే అతను మరణించాడట. అప్పటి నుంచి భానుమతి గారు జాతకాలు చూడటం మానేశారట..!!