అవికా ఘోర్..ఈ పేరు చెప్పగానే చాలామందికి ఈ నటి ఎవరో వెంటనే గుర్తురాకపోవచ్చు. కానీ చిన్నారి పెళ్లికూతురు అనగానే చాలామంది టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఆ సీరియల్, సీరియల్లో ఆనందిగా అవికా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఈ సీరియల్ వచ్చి ఇప్పటికీ పది సంవత్సరాలు పైనే అవుతోంది. అయితే ఇన్నాళ్లకు హీరోయిన్గా అవికాకు బాలీవుడ్లో అడుగుపెట్టే అవకాశం దొరికింది. ‘బాలికా వధు’ పేరుతో అవికా ఘోర్ నటించిన సీరియల్ ముందుగా హిందీలో విడుదలయ్యింది. అక్కడ చాలా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతో దీనిని తెలుగులోకి డబ్ చేశారు.
ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ సంపాదించుకున్న అవికా ఘోర్.. వెండితెరపై హీరోయిన్గా మారింది మాత్రం తెలుగులోనే. తెలుగులో పలు సినిమాల్లో నటించి డీసెంట్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న తర్వాత ఇంతకాలానికి అవికా హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. 2008లో హిందీలో విడుదలయిన బెస్ట్ హారర్ సినిమాల్లో ఒకటి ‘1920’. ఈ సినిమాతోనే అదా శర్మ హీరోయిన్గా పరిచయమయ్యింది. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్లో అదా శర్మ ప్లేస్‌లో అవికా నటించనుంది. ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ టైటిల్‌తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని అవికా ఘోర్ తన సోషల్ మీడియాలో ప్రకటించింది.