సొంతంగా సినిమాలు తీసిన హీరోయిన్లు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో విజయలలిత ఒకరు. శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా ఆమె ‘దేవుడు మామయ్య’ పేరుతో ఓ సినిమా తీశారు. కె. వాసు దర్శకుడు. ఇందులో విజయలలిత కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 1980 జనవరి 14న విడుదలకు ఈ చిత్రం సిద్ధమైంది. అయితే ఫైనాన్స్ విషయం సెటిల్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్స్ సహకరించకపోవడం వల్ల ‘దేవుడు మామయ్య’ చిత్రం విడుదల ఆగిపోయింది. నటి, నిర్మాత విజయలలిత ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకు పడలేదు. ప్రతిష్టంబన తొలగిపోలేదు. ఇక తన వల్ల కాకపోవడంతో దర్శకరత్న దాసరి నారాయణరావును ఆశ్రయించారు విజయలలిత.
సమస్యను పరిష్కరించి, సినిమా విడుదల చేసి పెట్టమని ఆయన్ని అభ్యర్ధించారు. ఒక్క నిముషం కూడా విరామం లేకుండా, రాత్రీపగలు తేడా లేకుండా దాసరి వర్క్ చేస్తున్న తరుణం అది. తను ఎంత బిజీగా ఉన్నా.. వెంటనే దాసరి కార్యరంగంలోకి దిగి ఫైనాన్షియర్లు, డిస్ర్టిబ్యూటర్స్‌తో మాట్లాడి సెటిల్ చేశారు. అలా 1980 జనవరి 14న విడుదల కావాల్సిన ‘దేవుడు మావయ్య’ చిత్రం సంవత్సరం ఆలస్యంగా అంటే 1981 జనవరి 14న విడుదలైంది. హమ్మయ్య ఇక కష్టాలు తొలగిపోయాయి అని విజయలలిత అనుకుంటున్న తరుణంలో ‘దేవుడు మావయ్య’ చిత్రంలో కథానాయికగా నటించిన వాణిశ్రీ నిర్మాత మీద కేసు పెట్టారు.
ఆ చిత్రంలో నటించినందుకు వాణిశ్రీకి 80 వేల రూపాయలు పారితోషికం ఇవ్వడానికి నిర్మాత అంగీకరించారు. 30 వేల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. తనకు ఇవ్వాల్సిన 50 వేల రూపాయలు ఇవ్వకుండా సినిమా విడుదల చేశారనీ, ఆ డబ్బు తనకు ఇప్పించండంటూ వాణిశ్రీ ఆ కేసు వేశారు. తీర్పు వచ్చేవరకూ పంపిణీదారులు నిర్మాతలకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఆపుజేయాలని ఆమె పిటీషన్ దాఖలు చేశారు. మళ్లీ దాసరి దగ్గరకు వెళ్లారు విజయలలిత. ఆయన వాణిశ్రీతో మాట్లాడి, కేసు విత్ డ్రా చేయించారు. విజయలలితకు, వాణిశ్రీకు మధ్య రాజీ కుదిర్చి, విషయం సెటిల్ చేశారు..