ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి కి ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు, కుమార్తె పేరు పల్లవి, కుమారుడి పేరు చరణ్, ఆ పేర్లను చూస్తేనే తెలిసిపోతుంది, బాలు గారికి పాటంటే ఎంత ఇష్టమో. చరణ్ ని బాలు గారు సరదాగా “అరక్కోణం రావు” అని పిలుస్తూ ఆట పట్టించే వారు, బాలు గారు చరణ్ ను అలా పిలవటానికి ఒక కారణం ఉంది. బాలు గారిది ప్రేమ వివాహం పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా స్నేహితుల సహకారంతో సావిత్రి గారిని వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత గాయకుడిగా పుంజుకోవటం, ఇరు కుటుంబాల వారు కలసిపోవటం, పల్లవి జన్మించటం జరిగిపోయింది. సావిత్రి గారు రెండవ సారి గర్భవతిగా ఉన్నప్పుడు..
పుట్టింటి వారు ఆమెను ప్రసవం కోసం రైలులో బెంగుళూరుకి తీసుకొని బయలుదేరారు. దారిలో సావిత్రి గారికి పురిటి నొప్పులు స్టార్ట్ కావటం తో కంగారు పడ్డారు, విషయం గమనించిన టి.టి.ఈ.అరక్కోణం స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ని సంప్రదించి, సావిత్రి గారిని అరక్కోణం రైల్వే హాస్పిటల్ కి తరలించారు. సావిత్రి గారు అక్కడ మగ బిడ్డను ప్రసవించటం జరిగింది. ఆ విషయం అరక్కోణం స్టేషన్ మాస్టర్ బాలు గారికి ఫోన్ చేసి తెలియచేశారట.బెంగుళూరు దాకా వెళ్లకుండానే దారిలో, అరక్కోణం లో పుట్టాడు కాబట్టి చరణ్ ని సరదాగా” అరక్కోణం రావు” అంటూ పిలిచేవారట బాలు గారు..