ఓసినిమా విడుదల నెల రోజులో, ఆరు నెలలో.. మహా అయితే ఏడాదో వాయిదా పడుతుంది. కానీ ఓ సినిమా 40 ఏళ్లు వాయిదా పడుతూ పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఈవారంలో విడుదల అవుతోంది. అదే..`ప్రతిబింబాలు`.ANR, జయసుధ జంటగా నటించిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. 1982లోనే ఈసినిమా చిత్రీకరణ పూర్తయింది. అప్పట్లో విడుదల చేద్దామంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతీసారీ.. విడుదల తేదీ ప్రకటించడం, ఆ తరవాత వాయిదా వేయడం ఇలా పరిపాటిగా మారిపోయిది.
కొన్నాళ్ల తరవాత ఆ ప్రయత్నాలే వదిలేశారు. ఏఎన్నార్ నటించిన సినిమాల్లో విడుదల కాకుండా ఉండిపోయిన సినిమా ఇదొక్కటే. చివరికి ఇప్పుడు మోక్షం లభించింది. ఈనెల 5న ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 250 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. 4కే టెక్నాలజీ, టీడీఎస్ లాంటి ఆధునిక హంగులు ఈ సినిమాకి జోడించారు. పాత సినిమాలు రీ రిలీజ్ అయి, భారీ వసూళ్లు అందుకొంటున్న తరుణంలో తమ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని చిత్రబృందం నమ్ముతోంది. ఏఎన్నార్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే..!!