ఆంధ్ర టైగర్ నెల్లూరు కాంత రావు! నటుడు, నిర్మాత, థియేటర్ యజమాని అయిన నెల్లూరు కాంత రావు స్వతహాగా పహిల్వాన్ ఆ రోజుల్లో కింగ్ కాంగ్, తార సింగ్ వంటి మల్ల యోధులను నెల్లూరికి పిలిచి పోటీలు నిర్వహించిన మల్లయోధుడు అయన. నెల్లూరు నగరం లో ఒకప్పటి కనక మహల్ ఆయన నిర్మించినదే, థియేటర్ యజమాని గ మన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రాజకీయ ప్రవేశం చేయటానికి కారణభూతులు అయ్యారు. హీరో కృష్ణ నటించిన “అవేకళ్ళు” సినిమా కనక మహల్ లోనే రిలీజ్ అయింది, ఆ సమయంలో థియేటర్ క్యూ లైన్ లో తోపులాటకు బయటకు వచ్చిన ఒక స్టూడెంట్, మళ్ళీ క్యూ లైన్ లోకి ప్రవేశించటానికి ప్రయత్నిస్తుండగా, అతను క్యూ లైన్ లోకి జొరబడుతున్నాడని భ్రమించి, అతనిని లాగి బయట పడేసారు కాంత రావు, అతను దురుసుగా మాట్లాడేసరికి రెండు తగిలించారు, అంతే వి.ఆర్. కాలేజీ స్టూడెంట్ ను నెల్లూరు కాంత రావు కొట్టారు అన్న వార్త దావానలం లాగా టౌన్ అంత వ్యాపించింది. అప్పటి వి.ఆర్. కాలేజీ స్టూడెంట్ అయిన వెంకయ్య నాయుడు గారు థియేటర్ యజమాని దౌర్జన్యానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా స్టూడెంట్స్ ని పోగేసి పెద్ద తిరుగుబాటు చేసారు. కాంత రావు పలుకుబడి కలవారు కావటం తో వెంకయ్య నాయుడు లాక్ అప్ లో గడపవలసి వచ్చింది.
బుద్దుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు, మన నాయుడు గారికి లాక్ అప్ లో జ్ఞానోదయం అయింది, మనకి రాజకీయ అండదండలు లేకుంటే మనం ఇటువంటి దౌర్జన్యాలను ఎదిరించటం కష్టం అని గ్రహించి, ఆ తరువాతి కాలంలో ఆయన ఆర్.ఎస్.ఎస్. లో స్వయం సేవకుడిగా చేరటం, తదనంతరం విద్యార్థి నాయకుడిగా, రాజాకీయ నాయకుడిగా ఎదగటం జరిగింది. అదే విధంగా నిర్మాత గ మారిన కాంత రావు గారు హీరో కృష్ణ గారు “అల్లూరి సీతారామరాజు” పాత్ర చేయటానికి బీజం వేశారు. 1967 లో కృష్ణ గారితో “అసాధ్యుడు” అనే సినిమా నిర్మించారు, ఆ చిత్రం లోనే మొట్ట మొదటి సారిగా హీరో కృష్ణ గారు అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించారు. నెల్లూరీయుడు ఆ చిత్ర మేక్ అప్ మాన్ అయిన రూప శిల్పి కుమార్ కృష్ణ గారికి మొదటి సారిగా అల్లూరి గెట్ అప్ వేశారు. ఆ తరువాతి కాలం లో కృష్ణ గారు పద్మాలయ బ్యానేర్ లో నిర్మించిన “అల్లూరి సీతారామ రాజు ” చిత్రానికి కూడా ఆయన కు తొలిసారి సీతారామ రాజు గెట్ అప్ వేసిన కుమార స్వామి గారితోనే మేక్ చేయించుకున్నారు కృష్ణ గారు. అల్లూరి సీతారామ రాజు గ కృష్ణ గారి నటన అద్భుతం, ఆయనను సీతారామ రాజు రూపం లో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిపిన ఘనత మాత్రం రూప శిల్పి కుమార్ గారిదే అని చెప్పటానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ విధం గ నెల్లూరు కాంత రావు ఇద్దరి జీవితాలలో పెను మార్పుకు కారణం అయ్యారు..!!