ప్రముఖ మలయాళీ నటి భావన ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడింది. 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. సుప్రసిద్ధ మలయాళీ హీరో దిలీప్ కు కూడా ఈ కేసుతో సంబంధం ఉండడంతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
దిలీప్ బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు ఇంకా కొనసాగుతోంది. ఈ దారుణమైన ఘటన జరిగి ఐదేళ్లు పూర్తయ్యింది. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ను భావన షేర్ చేసింది. “ఇది అంత తేలికైన ప్రయాణం కాదు. బాధితురాలి నుండి ప్రాణాలతో బయటపడే ప్రయాణం. ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి బరువుతో నా పేరు, నా గుర్తింపు అణచివేయబడింది. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానపరచడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి.
కానీ అలాంటి సమయంలో నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా గొంతులు వింటున్నాను. న్యాయం కోసం ఈ పోరాటంలో నేను ఒంటరిగా లేనని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను ఈ ప్రయాణం కొనసాగిస్తాను. నాతో పాటు నిలబడిన వారందరికీ మీ ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది భావన..