తొలుత చిన్న సినిమాగా తీద్దామని రాజమౌళి మొదలు పెట్టిన ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా మారిపోయిందట. రాజమౌళి ‘మగధీర’ తర్వాత కాస్త విశ్రాంతి కోసం ‘మర్యాద రామన్న’ తెరకెక్కించారు. ఆ తర్వాత ప్రభాస్‌తో సినిమా తీసేందుకు నాలుగైదు నెలల సమయం ఉంది. ఆ సమయంలో ఓ సినిమా తీసేద్దాం అని ‘ఈగ’ను మొదలు పెట్టారు. ఈగ అంటే మనం చేత్తో విదిలించుకునే ఒక పురుగు. అలాంటి పురుగు మనిషి మీద పగ తీర్చుకోవడమంటే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ‘ఈగ’ను ఎంచుకున్నారట.
తొలుత రూ.2 కోట్ల నుంచి 3 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించాలన్న ఉద్దేశంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఒక సాధారణ డిజిటల్ కెమెరాతో తీసి కేవలం మల్టీప్లెక్స్‌లు, కొన్ని ఎంచుకున్న థియేటర్లలో మాత్రమే విడుదల చేద్దామని అనుకున్నారట. చిత్రీకరణ సమయంలో ప్రతి సన్నివేశాన్ని బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించారు. అయితే.. నిర్ణీత బడ్జెట్ పెద్ద సమస్యగా మారింది. అడుగు ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే నిర్మాత సురేశ్‌బాబు కల్పించుకొని.. మీరు అనుకున్నట్లుగా సినిమా తీయండి బడ్జెట్ సంగతి తర్వాత చూసుకుందాం అన్నారు. తీరా చూస్తే.. చిన్నది అనుకున్న సినిమా కాస్త పెద్ద బడ్జెట్ సినిమా అయిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.