
సౌత్ ఇండియన్ యాక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా తన పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో, కొన్ని మీడియా కథనాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐశ్వర్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల ఐశ్వర్య అర్జున్, ఆమె భర్త ఉమాపతి రామయ్య మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలతో పాటు ఐశ్వర్య వ్యక్తిగత అలవాట్ల గురించి కూడా కొన్ని అభ్యంతరకరమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
ముఖ్యంగా ఆమె మద్యానికి బానిస అంటూ జరుగుతున్న ప్రచారం అర్జున్‌ను తీవ్రంగా కలచివేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన అర్జున్, సెలబ్రిటీల కుటుంబాలకు చెందినవారైనంత మాత్రాన వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టానుసారంగా కథనాలు అల్లే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై మొదట్లో మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నామని అర్జున్ తెలిపారు..తన కుమార్తె వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా, ఆమెకు తగిన సమయం వచ్చినప్పుడు తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఇవ్వాలని భావించినట్లు చెప్పారు.
అయితే పదేపదే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఆమె గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతుండటంతో స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మౌనంగా ఉండటాన్ని తప్పులను అంగీకరించినట్లుగా భావించకూడదని ఆయన హెచ్చరించారు. ఇక ఈ వివాదానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్యల వివాహం 2024 జూన్ 10న చెన్నైలో ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. వీరిద్దరికీ అర్జున్ హోస్ట్ చేసిన 'సర్వైవర్' రియాలిటీ షో ద్వారా పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఇటీవల అర్జున్ చిన్న కుమార్తె అంజనా వివాహ వేడుకల్లో ఉమాపతి కనిపించకపోవడం, అలాగే సోషల్ మీడియాలో కొన్ని పరిణామాలు చోటుచేసుకోవడంతో వీరి వైవాహిక జీవితంపై ఊహాగానాలు మొదలయ్యాయి..!!
