
సినిమా ప్రపంచంలో దర్శకుడి పాత్ర ఎంతో కీలకమైనది. తెర వెనుక ఉండి కథను, నటీనటులను, సాంకేతిక బృందాన్ని సమన్వయం చేస్తూ ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకుడిదే ప్రధాన బాధ్యత. అయితే చాలామంది ప్రతిభావంతులైన దర్శకులు తమ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ వ్యక్తిగతంగా లైమ్‌లైట్‌కు దూరంగానే ఉంటారు. కానీ కొందరు దర్శకులు మాత్రం తమ సినిమాలతోనే కాకుండా వ్యక్తిత్వం, మాటతీరు, ప్రవర్తనతోనూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంటారు. అలాంటి దర్శకులు ఎక్కడ కనిపించినా అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తుంది.
ఒకప్పుడు RGV ఇలాంటి క్రేజ్ ఉండేది. ఆయన సినిమా ఈవెంట్లకు వచ్చినా, మీడియాతో మాట్లాడినా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపించేది. ఇప్పుడు అదే తరహా ఫాలోయింగ్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సంపాదించుకున్నారు.
ఆయన ఏదైనా సినిమా వేడుకకు హాజరైనా, ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నా స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అభిమానుల నుంచి స్పందన లభిస్తోంది. కేవలం దర్శకుడిగానే కాకుండా తనదైన ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆయనకు ఉన్న ఈ క్రేజ్ మరోసారి థియేటర్లలో స్పష్టంగా కనిపించింది. విశ్వక్సేన్ నటించిన ‘ఈఎన్‌ఈ రిపీట్’ సినిమాలో ఐదుగురు దర్శకులు క్యామియో పాత్రల్లో కనిపించారు. అయితే వారందరిలో సందీప్ రెడ్డి వంగ ఎంట్రీకి వచ్చిన స్పందన మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. సినిమాలోని ఇతర నటీనటులను తక్కువ చేయకుండా చెప్పాలంటే, విశ్వక్సేన్ సహా ప్రధాన పాత్రధారులు తెరపై కనిపించినప్పుడు వచ్చిన స్పందన కంటే సందీప్ కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎక్కువగా ఉండటం విశేషం.
ఆయన తెరపైకి రాగానే థియేటర్లలో అభిమానుల కేరింతలు, అరుపులతో ఆడిటోరియాలు దద్దరిల్లిపోతున్నాయి. సాధారణంగా హీరోల ఎంట్రీలకు మాత్రమే ఈ స్థాయిలో స్పందన కనిపిస్తుంది. కానీ ఒక దర్శకుడి క్యామియోకు కూడా ఇలాంటి ఆదరణ లభించడం ఆయనకున్న ప్రత్యేకమైన క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి సందీప్ రెడ్డి వంగకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ కేవలం మాటలకే పరిమితం కాదని, వెండితెరపై ఆయన కనిపించినా ప్రేక్షకులు అదే స్థాయిలో స్పందిస్తారని ‘ఈఎన్‌ఈ రిపీట్’ మరోసారి నిరూపించింది..ఇక సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’తో బిజీగా ఉన్నారు. ‘యానిమల్’ వంటి భారీ విజయవంతమైన సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది..!!

