
నందమూరి వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ తెరంగేట్రం కోసం అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా హిట్ ‘హను-మాన్’ తర్వాత నందమూరి వారసుడిని కథానాయకుడిగా పరిచయం చేసేందుకు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందుకు వచ్చారు. ఆ బాధ్యత తీసుకున్నారు. తెల్లవారితే సినిమా ఓపెనింగ్ అనగా ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. ఆ సినిమా పూజ ఎందుకు ఆగింది? అనేది ఇప్పటికీ బయటకు రాలేదు. కట్ చేస్తే..ఇప్పుడు మరో దర్శకుడితో సినిమా చేసేందుకు మోక్షజ్ఞ తేజ రెడీ అయినట్టు తెలిసింది.
యువ దర్శకుడు వశిష్ఠ మల్లిడి చెప్పిన కథకు నందమూరి బాలకృష్ణ ఓటు వేశారని టాలీవుడ్ టాక్. మరి ఆ కథ ఏ జానర్? హీరో క్యారెక్టర్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’తో వశిష్ఠ మల్లిడి దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ తీశారు. విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీ పడకూడదని, క్వాలిటీ ప్రోడక్ట్ ప్రేక్షకులకు అందించాలని అనుకోవడంతో ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. ఆ సినిమా విడుదలకు ముందు మరో సినిమాను, అదీ నందమూరి మోక్షజ్ఞ తేజ పరిచయ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి రెడీ అయ్యారు వశిష్ఠ మల్లిడి..!!

