
తమన్నా మాట్లాడుతూ, హిందీ చిత్ర పరిశ్రమలో నటీమణులకు తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని, అక్కడ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లేదా గ్లామర్ పాత్రలు అని విభజన ఉంటుందని తెలిపారు. కానీ, దక్షిణాది సినిమాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. “నేను సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో, ఇక్కడ వాతావరణం ఎందుకు అలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. ఇదొక పితృస్వామ్య ధోరణిలో లేదా మహిళలను చూసే చూపులో ఒక ప్రత్యేకమైన కోణం కనిపిస్తుంది. ఆ చూపు మహిళలను గౌరవించేలా ఉండదు” అని తమన్నా కుండబద్ధలు కొట్టారు.
మెయిన్‌స్ట్రీమ్ దక్షిణాది సినిమాల్లో మహిళలు బహుముఖ పాత్రలను పోషించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో నటించడంతో పాటు, గ్లామర్ ఒలకబోయడం, మాస్ పాటల్లో స్టెప్పులు వేయడం వంటివన్నీ ఏకకాలంలో చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఒత్తిడి , అంచనాల మధ్య నిలదొక్కుకోవడమే నాయికలకు అతి పెద్ద సవాలు అని ఆమె వ్యాఖ్యానించారు. సినిమాల్లోని ‘ఐటమ్ సాంగ్స్’ అని పిలవడాన్ని తమన్నా తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని కేవలం ఉత్సవాలు లేదా పార్టీ పాటలుగా మాత్రమే చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు..!!
