ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన హీరో వడ్డే నవీన్ చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన కేవలం హీరోగానే కాకుండా, నిర్మాతగా, కథా రచయితగా బహుముఖ పాత్రలు పోషిస్తూ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా విడుదల చేసింది. ఆసక్తికరమైన ఈ పోస్టర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది..
వివరాల్లోకి వెళితే, వడ్డే నవీన్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత అయిన స్వర్గీయ వడ్డే రమేశ్ వారసత్వాన్ని కొనసాగించేందుకు నడుం బిగించారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌తో ‘బొబ్బిలి పులి’, చిరంజీవితో ‘లంకేశ్వరుడు’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన ‘విజయ మాధవి కంబైన్స్’ సంస్థ ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో తెలిసిందే. ఇప్పుడు అదే స్ఫూర్తితో వడ్డే నవీన్ ‘వడ్డే క్రియేషన్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నారు..!!